
సర్వే@ 63 శాతం
జిల్లాలో ఇలా..
నాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ఏకకాలంలో చేపట్టిన డిజిటల్ సర్వే, పంటల సాగు నమోదు జిల్లాలో ఊపందుకుంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 63శాతం సర్వే పూర్తి చేశారు. సెప్టెంబరు 1న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అధికారులు సర్వే జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించి, రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. వాటిని సరిచేసి చివరి జాబితాను 28న ప్రభుత్వానికి నివేదించనున్నారు.
వివరాలను శాటిలైట్‌కు అనుసంధానం
చేయాలనే లక్ష్యంతో..
రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ కమతాలను, పంటల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆ వివరాలను శాటిలైట్‌కు అనుసంధానం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తోంది. మొబైల్ యాప్‌తో క్ల్లస్టర్ పరిధిలోని ప్రతి ఏఈఓ 2వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాలు ఈ ఏడాది నమోదు చేయాల్సి ఉంది. ప్రతి ఏఈఓ తన క్లస్టర్ పరిధిలోని భూ కమతాలకు వెళ్లి సర్వే నంబర్‌ను ఎంపిక చేసుకుని భూమిలో సాగు చేసిన పంటను ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
సర్వే నంబర్ల ఆధారంగా..
అన్నదాతలు సాగు చేసిన ప్రతి పంట వివరాలను అధికారులు సర్వే నంబర్ల ఆధారంగా నమోదు చేస్తారు. మొబైల్ యాప్‌తో సాగు విస్తీర్ణం అప్‌లోడ్ చేస్తారు. వరి పంటకు సంబంధించి రకాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం లేని భూముల్లో సాగు, రైతుల వివరాలను, ఆధార్ వివరాలను పరిగణనలోకి తీసుకుని యాప్‌లో నమోదు చేస్తున్నారు.
6.17 ఎకరాల్లో సాగు
జిల్లాలో 6.17లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దీనిలో వరి 4,85,125 ఎకరాలు, పత్తి 91వేల ఎకరాలు, కంది 2,650 ఎకరాలు, పెసర 2,700 ఎకరాలు, వేరుశనగ 400 ఎకరాలు, మొక్కజొన్న 45 ఎకరాలు, మిర్చి 15,150 ఎకరాలు, చెరకు 60 ఎకరాలు, ఆయిల్‌పామ్ 4,000 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాలు, పండ్లు, కూరగాయలు 16,200 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిలో ఇప్పటి వరకు సుమారు 3లక్షల ఎకరాల్లో వరి, 80వేల ఎకరాల్లో పత్తి, 10వేల ఎకరాల్లో ఇతర పంటల వివరాలను ఏఈఓలు సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
రైతుల సంఖ్య : 2.81 లక్షలు
క్లస్టర్లు : 82
పంటల సాగు విస్తీర్ణం : 6.17 లక్షలు
నమోదు చేసిన పంటలు : 3.90 లక్షలు
ఫ 3.90లక్షల ఎకరాల్లో పూర్తయిన డిజిటల్ సర్వే
ఫ సాగైన పంటల నమోదు ముమ్మరం
ఫ ఈనెల 25 లోపు పూర్తిచేసేలా
కార్యాచరణ
ఫ తుది జాబితాను 28న ప్రభుత్వానికి నివేదించనున్న అధికారులు
ఫ ఎరువుల అవసరం, సంక్షేమ పథకాల అమలులో ప్రామాణికం కానున్న సర్వే
రైతులకు బహుళ ప్రయోజనాలు
పంట నమోదు, డిజిటల్ సర్వేతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. రైతుల పేరుతో పత్తి, ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే వ్యాపారులు, మధ్య దళారులను నిలువరించవచ్చు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో తెలపడంతో పాటు ఎరువుల అవసరం, సంక్షేమ పథకాల అమలులో దీనిని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నడు పరిహారం అందించేందుకు ఈ వివరాలు చాలా ఉపయోగపడతాయి.

సర్వే@ 63 శాతం