బాలల భవితకు బాట వేసేలా.. | - | Sakshi
Sakshi News home page

బాలల భవితకు బాట వేసేలా..

Sep 21 2025 5:41 AM | Updated on Sep 21 2025 5:41 AM

బాలల

బాలల భవితకు బాట వేసేలా..

పోషణ మాసోత్సవాల్లో..

కలెక్టర్‌ చొరవతో అంగన్‌వాడీకేంద్రాల్లో వినూత్న రీతిలోపూర్వ ప్రాథమిక విద్య

ఆట,పాటలు, అభినయంతో

ప్రత్యేక బోధన

ఎంతో ఆసక్తిచూపిస్తున్న చిన్నారులు

భానుపురి (సూర్యాపేట) : బాల్య దశలోనే చిన్న పిల్లలకు మంచి పద్ధతులు, అలవాట్లు నేర్పిస్తే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బాలల బంగరు భవితకు పునాదులు వేసేలా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ఆటపాటలు, అభినయంతో బోధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేంద్రాలను నిత్యం సందర్శిస్తూ పిల్లల సామర్థ్యాలను అంచనావేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు.

పిల్లల సమగ్రాభివృద్ధికి..

మనిషి జీవితంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసే పునాది దశగా భావించవచ్చు. ఈ వయసులో నేర్చుకున్న నైపుణ్యాలు పిల్లల్లో శారీరక అభివృద్ధితో పాటు మెరుగైన ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇవి పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్ప డతాయి. తద్వారా మంచి పౌరులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఈ కారణంతోనే నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 3నుంచి 6సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. పిల్లలకు ప్రతినెలా మంచి అలవాట్లను నేర్పిస్తున్నారు. వీరికి ఇప్పటికే పౌష్టికాహారం అందిస్తుండగా.. ఇటీవల నుంచి ఇమ్యునైజేషన్‌, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, పోషణ, ఆరోగ్య విద్య వంటివి అందిస్తున్నారు.

పకడ్బందీగా అమలు

జిల్లాలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 5,168 మంది గర్భిణులు, 36,378 మంది చిన్నారులు, 4,168 మంది బాలింతలు పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. జిల్లాలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ప్రత్యేక శ్రద్ధతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పిల్లలకు బట్టీ పద్ధతిలో కాకుండా ఆసక్తికరంగా ప్రీస్కూల్‌ అంశాలను బోధిస్తున్నారు. పిల్లలకు కథలను చదివి వినిపించడం లాంటి పద్ధతి కాకుండా అభినయాల ద్వారా బోధిస్తున్నారు. దీంతో పిల్లలు కథలను బాగా అర్థం చేసుకోవడంతో పాటు, పాత్రలకు తగ్గట్టుగా నటిస్తున్నారు. కలెక్టర్‌ ప్రత్యేకించి అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తూ పిల్లల ఆట పాటల ద్వారా వారి తెలివితేటలను, సామర్థ్యాలను, వారి చలాకీతనాన్ని అంచనా వేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు చిన్నప్పుడు పాటల్ని బాగా ఇష్టపడతారు. తల్లి పాడే జోల పాట మొదలుకొని అభినయంతో కూడిన పాటలు పిల్లలకు ఎంతో ఇష్టం. అలాంటి పాటలను అంగన్‌వాడీ కేంద్రాల్లో నేర్పిస్తున్నారు.

ప్రత్యేక చొరవ..

ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి తేజస్‌ నందలాల్‌ పవార్‌ లాంటి కలెక్టర్‌ తోడైతే నిజంగా భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా తయారవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని ద్వారా వారి శారీరక అభివృద్ధితో పాటు, మానసిక సామర్థ్యాలు, ఉల్లాసం, ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఉండడం, స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండడం, ఆటలు, పాటలతో పిల్లల్లో ఆలోచించే సామర్థ్యం సైతం చిన్నప్పటి నుంచి అలవడుతుంది. దీంతో వారి జ్ఞానం పెంపొందడమే కాకుండా, వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, బొమ్మలు గీయించడం లాంటివి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో మమేకమైన కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

పిల్లలు అన్ని అంశాలలో చురుకుగా ఉండేందుకు ఇప్పటికే ప్రీస్కూల్‌ కిట్లను అందించారు. ప్రత్యేకించి డ్రాయింగ్‌తో పాటు, సింగింగ్‌, ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ వంటి వినూత్న కార్యక్రమాలను కలెక్టర్‌ నేర్పించేలా చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్‌ అంగన్‌వాడీ పిల్లలతో మాట్లాడి వారిని ఆట పాటలతో చైతన్య పరుస్తున్నారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ,అంగన్‌ వాడీ కేంద్రాలలో కిచెన్‌ గార్డెన్‌ ల పెంపకం, రకరకాల అంశాల పట్ల ఆట పాటలతో వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిరోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

బాలల భవితకు బాట వేసేలా..1
1/1

బాలల భవితకు బాట వేసేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement