
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాలకవీడు మండలంలో నిర్మాణంలోఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపై ఉదయం సమీక్షిస్తారు. అనంతరం హుజూర్‌నగర్‌లో ఐటీఐ, ఏటీసీ, డిగ్రీ కళాశాల భవనాలను, హౌసింగ్ కాలనీ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఇటీవల పట్టణంలో మృతి చెందిన రైస్ మిల్లర్ గెల్లి అప్పారావు, గెల్లి అరుణ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శిస్తారు. మధ్యాహ్నం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు, ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద ఎంబీసీ లిఫ్టు పనులు, దొండపాడు వద్ద లిఫ్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కోదాడ మండలానికి వెళతారు.
పెంచికల్‌దిన్న పీఏసీఎస్ చైర్మన్ సస్పెన్షన్
ఫ నూతన చైర్మన్‌గా సిద్దపంగ శ్రీను
నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ శాఖమూరి శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార సంఘం అధికారి పద్మ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్ శ్రీకాంత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ సంఘానికి సంబంధించిన నగదు మొత్తాన్ని సొంతానికి వాడుకుంటూ తిరిగి చెల్లించకపోవడంతో పాటు అధికారుల నోటీసులకు సైతం స్పందించకపోవడంతో సస్పెండ్‌కు గురైనట్లు సీఈవో వెంకన్న తెలిపారు. చైర్మన్‌తో పాటు మరో డైరెక్టర్ వల్లంశెట్ల నారాయణ డిఫాల్టర్‌గా తేలడంతో ఆయనను కూడా సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సస్పెండ్‌కు గురైన శ్రీకాంత్ స్థానంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ సిద్దపంగ శ్రీనుకు చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
సూర్యాపేటటౌన్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మను అధికారికంగా నిర్వహించుకునేలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ చీరలు బందైనయని విమర్శించారు. బతుకమ్మ, దేవీనవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రజలందరికీ బతుకమ్మ, దేవీశరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
యూరియా కొరతను నివారించాలని వినతి
భానుపురి (సూర్యాపేట) : యూరియా కొరతను నివారించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. ఈమేరకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఎక్కువ శాతం ఆయకట్టు ఉన్నందున అధికంగా యూరియా కేటాయించాలన్నారు. కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, హేమలత, ఎండి పాషా పాల్గొన్నారు.
మట్టపల్లిలో వైభవంగా అగ్నిమథనం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠాపన, పవిత్రములశుద్ధి, సప్తదశకుంభాసాధన, సాయంత్రం అగ్నిధ్యానం, శయ్యావేది ప్రకల్పనం, పవిత్రఆవాహనం, సుదర్శన యంత్రస్థాపన, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఆదివారం శతకలశస్నపనం ,పవిత్రారోపణం, బలిహరణ తదితర కార్యక్రమాలుంటాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్ తెలిపారు.