
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: స్థానిక లోనికోటకు చెందిన తొండమాల మహేష్ (37) ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీచెన్నకేశవపురంలో ఇనుప సామాన్ల అంగడిలో పనిచేసేవాడు. గత 15 సంవత్సరాలుగా పెళ్లి కోసం కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవడంతో మనోవేదనకు లోనయ్యాడు. సోమవారం ఉదయం పనికి వెళుతున్నట్లు తల్లి సుబ్బమ్మకు తెలిపి ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేష్ దుకాణానికి వెళ్లలేదు. వ్యక్తిగత పనిపై తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంటికి చేరుకుని చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సుబ్బమ్మకు దుకాణం యజమాని ఫోన్ చేసి మహేష్ పనికి రాలేదని తెలపడంతో ఆమె నేరుగా ఇంటికెళ్లి చూసింది. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడుని చూసి బోరున విలపించింది. గతంలో భర్త రామాంజనేయులు అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.