
మాట్లాడుతున్న కేవీ ఉష శ్రీచరణ్, ఈరలక్కప్ప
మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ హెచ్చరిక
ప్రశాంతి నిలయం: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ అర్థిక సంఘం నిధులను పార్టీలకు అతీతంగా అన్ని పంచాయతీలకు మంజూరు చేయాలని, లేకుంటే మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇళ్లను సర్పంచ్‌లతో కలసి ముట్టడిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్, మడకశిర వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప హెచ్చరించారు. మడకశిర, పెనుకొండ నియోజకవర్గాలలో 15వ ఆర్థిక సంఘం నిధులను పచ్చ కండువాలు కప్పుకుంటేనే మంజూరు చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యేలు సవిత, ఎంఎస్ రాజు వ్యవహరిస్తున్న తీరును వారు ఖండించారు. ఈ అంశంపై న్యాయం కోరుతూ సోమవారం పలువురు సర్పంచ్‌లతో కలసి కలెక్టరేట్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ.. పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్పంచ్‌లు పనిచేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో నిధులు మంజూరు కాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో తాను సూచించిన పంచాయతీలకే ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం మంత్రి సవిత దుర్మార్గానికి నిదర్శనమన్నారు. నిధుల మంజూరులో వివక్ష చూపితే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈరలక్కప్ప మాట్లాడుతూ... కేంద్రం విడుదల చేసే అర్థిక సంఘం నిధులపై కూటమి నాయకుల పెత్తనం చెలాయించడం దారుణమన్నారు. టీడీపీకి చెందిన సర్పంచ్‌లకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆదేశించడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వివక్ష లేకుండా అన్ని పంచాయతీలకు 15వ అర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలకు చెందిన పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.