
ద్విచక్ర వాహనం ఢీ – వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన పగిరెడ్డి శంకర్‌రెడ్డి(47) కియా పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో 44వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఘటనలో తీవ్రంగా గాయపడని శంకరరెడ్డిని స్థానికులు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం శంకరరెడ్డి మృతిచెందాడు. ఆయనకు భార్య సుకన్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై కియా ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
మడకశిర రూరల్: మండలంలోని హెచ్‌ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్కటీ కుదరకపోవడంతో విరక్తి పెంచుకుని మద్యానికి బానిసయ్యాడు. ఇక తనకు పెళ్లి కాదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం
ప్రశాంతి నిలయం: కుటుంబ విలువలు, బంధాల గురించి రామాయణ ద్వారా సమాజానికి చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయమైనదని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
18న పాఠశాల స్థాయి జేవీవీ చెకుముకి
సంబరాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఈ నెల 18న పాఠశాల స్థాయిలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీర్రాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 35 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో ఈ సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు తర్వాత అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటున్న కార్యక్రమం ఇదేనన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో దాదాపు 4.50 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొంటుండగా జిల్లా తరఫున 25 వేల మందికి పైగా ప్రాతినిథ్యం వహించే అవకాశముందన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. పాఠశాల స్థాయిలో ఎంపికై న వారు మండల స్థాయిలో జరిగే పరీక్షలకు, అక్కడ ఎంపికై న వారు జిల్లా స్థాయి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమణయ్య, కోటేశ్వరప్ప, జేవీవీ నగర కార్యదర్శి ఎస్.తిరుపాల్, కోశాధికారి ఎం.రామిరెడ్డి పాల్గొన్నారు.