
రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయండి
అనంతపురం అర్బన్: జిల్లాలో నవంబరు 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక–2025 ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇందుకు ఆయా శాఖలు పూర్తి సహకారం అందించాలని జిల్లా అధికారులను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఆర్‌ఓ ఎ.మలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు మూడు రోజుల పాటు స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. క్రీడలు సజావుగా నిర్వహించేందుకు ఆయా శాఖలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే డీఆర్‌ఓతో చర్చించి పరిష్కారం పొందాలన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే ఉద్యోగులకు వసతి, రవాణా సదుపాయం కల్పించాన్నారు. మూడు రోజుల పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. రోజూ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్, డీపీఓకు సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్స్ కిట్లు, 108 అంబులెన్స్, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓని ఆదేశించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడా ఉత్సవాల్లో 27 యూనిట్లు పాల్గొంటాయన్నారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. సమావేశంలో ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ రాజేష్, ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీపీఓ నాగరాజునాయుడు, ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, గనుల శాఖ డీడీ ఆదినారాయణ, , రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్‌రావు, సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆయా శాఖలు సహకారం అందించాలి
అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం