
లక్ష్యం దిశగా విద్యాభ్యాసం సాగాలి
● జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ
హిందూపురం: ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రినౌల్డ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు షీల్డ్, మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె ప్రదానం చేసి, మాట్లాడారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందన్నారు. ఉన్నతమైన నిర్ణయాలు, మంచి ఆలవాట్లతో భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ పట్టుదల, క్రమశిక్షణతో విద్యాభ్యాసం సాగించి ఉత్తమ పౌరులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో న్యాయవాది సంతోషికుమారి, పాఠశాల నిర్వాహకులు ముస్తఫా ఆలీఖాన్, బీబీ హజీరా, సర్ఫరాజ్ ఆలీఖాన్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
క్షుద్రపూజల కలకలంపై
వీడిన మిస్టరీ
చిలమత్తూరు: స్థానిక పోలీసు స్టేషన్ ప్రహరీకి అనుకుని ఉన్న వెలుగు కార్యాలయ ఆవరణలో నిమ్మకాయలు, కుంకుమ, ఎర్రటి వస్త్రం పడి ఉండడం కలకలం రేపింది. క్షుద్రపూజలు జరిగాయంటూ జోరుగా చర్చ సాగింది. ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎస్‌ఐ మునీర్ అహ్మద్ వివరణ ఇచ్చారు. ఆయుధపూజ రోజు స్టేషన్‌లో పూజలు నిర్వహించిన అనంతరం శుభ్రం చేసే క్రమంలో వాటిని బయట పడేసినట్లు వివరించారు.
సమష్టి కృషితోనే
అక్రమ మద్యం నివారణ
ధర్మవరం అర్బన్: సమష్టిగా దాడులు చేపట్టి అక్రమ మద్యాన్ని నివారించాలని సంబంధిత అధికారులను ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అనంతపురం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్ ఆదేశించారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌ను మంగళవారం వారు తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. నాటుసారా తయారీని పూర్తిగా నివారించాలన్నారు. కర్ణాటక మద్యం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్‌ఐలు చాంద్‌బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇరువర్గాలపై కేసుల నమోదు
కదిరి టౌన్: ఘర్షణ కేసులో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. కదిరిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో నివాసముంటున్న సంజన, తనకల్లు మండలం సంజీవ్ నగర్‌కు చెందిన వీరంపల్లి శారద ఒకే కుటుంబానికి చెందిన వారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 4న కదిరిలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లక్ష్యం దిశగా విద్యాభ్యాసం సాగాలి

లక్ష్యం దిశగా విద్యాభ్యాసం సాగాలి