
నిండుకుండలా పీఏబీఆర్
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నిండు కుండలా దర్శనమిస్తోంది. మంగళవారం నాటికి 5.157 టీఎంసీలకు నీటిమట్టం చేరినట్లు డ్యాం డీఈ వెంకటరమణ తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా 185 క్యూసెక్కులు, జీడిపల్లి జలాశయం నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 510 క్యూసెక్కుల చొప్పున నీరు వచ్చి చేరుతున్నట్లు వివరించారు. డ్యాంలో ఏర్పాటైన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి 585 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, లీకేజీ రూపంలో 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 25 క్కూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు.
మూకుమ్మడిగా
హోంగార్డుల బదిలీ
మడకశిర: నియోజకవర్గంలోని వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న హోంగార్డులను ఉన్నతాధికారులు మూకుమ్మడిగా బదిలీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా30 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. ఇందులో 20 మంది వరకు బదిలీ అయ్యారు. పెనుకొండ, పరిగి, గోరంట్ల తదితర ప్రాంతాలకు వీరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిపాలన సౌలభ్యంలో భాగంగా బదిలీ అయ్యారా? లేదా రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ అయ్యారా అనే విషయం మిస్టరీగా మారింది.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పరిగి: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలను ఏఎస్‌ఐ బాలరాజు మంగళవారం వెల్లడించారు. హిందూపురం మండలం మలుగూరు వద్ద ఉన్న ఓ స్టీల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న పరిగి మండలం యు.బసవనపల్లికి చెందిన రమేష్.. ఈ నెల 3న ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం రమేష్ మృతి చెందాడు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన యు.బసవనపల్లికి చెందిన సుదీప్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.