140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Oct 7 2025 4:09 AM | Updated on Oct 7 2025 11:56 AM

Rice truck seized by police near Jallipalli

జల్లిపల్లి వద్ద పోలీసులకు పట్టుబడిన బియ్యం వాహనం

కూడేరు: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్‌ ఎస్‌ఐ జమాల్‌బాషా, సీఎస్‌డీటీ శాంతకుమారి కూడేరు మండలం జల్లిపల్లి వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. అనంతపురంలోని తపోవనంలో నివాసముంటున్న బాబా ఫకృద్దీన్‌ తన బొలెరో వాహనంలో వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి నుంచి 140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అనంతపురం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వాహనాన్ని సీజ్‌ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

రేషన్‌ బియ్యం డంప్‌ స్వాధీనం

ఉరవకొండ: స్థానిక స్పైస్‌ ఇన్‌ రైస్‌ రెస్టారెంట్‌ సమీపంలో అక్రమంగా డంప్‌ చేసిన 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సోమవారం ఉదయం తహసీల్దార్‌ మహబూబ్‌బాషా, సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వలు ఎవరో చేశారో విచారణ చేస్తున్నట్లు సీఐ మహనంది తెలిపారు.

పరిష్కార వేదికకు  65 వినతులు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్‌ నేరుగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. దివ్యాంగుల వద్దకు నేరుగా చేరుకుని వారి నుంచి వినతులు స్వీకరించి, మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆదినారాయణ, డీసీఆర్‌బీ సీఐ ఆదినారాయణ పాల్గొన్నారు

కిరికెరలో చోరీ

హిందూపురం: మండలంలోని కిరికెర వద్ద నివాసముంటున్న ఎడ్విన్‌ ఇంట్లో దుండగులు చొరబడి విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. వారం రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలసి తమిళనాడు వెళ్లిన ఎడ్విన్‌ సోమవారం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తలుపులు తీసి ఉండడంతో గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. 13 గ్రాముల బంగారు నగలు, 10 తులాల వెండి అపహరించినట్లుగా నిర్దారించుకుని ఫిర్యాదు చేయడంతో పోరలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు హిందూపురం రూరల్‌ పోలీసులు తెలిపారు.

నిప్పంటుకుని వృద్ధుడి మృతి

తాడిపత్రి టౌన్‌: స్థానిక గురు లాడ్జీ సమీపంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పట్టణానికి చెందిన వడ్డే వెంకటేష్‌ (75) మృతి చెందాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులో తన ఇంటి సమీపంలోని చెత్త వద్ద వడ్డే వెంకటేష్‌ పడిపోయాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్‌ అంటించుకుని అగ్గిపుల్ల ఆర్పకుండా పడేయడంతో చెత్తకు నిప్పు అంటుకుంది. ఎవరూ గమనించకపోవడంతో మంటలు చెలరేగి వెంకటేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి మృతదేహం లభ్యం

ఆత్మకూరు: అవమాన భారం తాళలేక హంద్రీ–నీవా కాలువలో దూకి గల్లంతైన ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన లక్ష్మీనారాయణ నాయక్‌ (45) మూడు రోజుల తర్వాత మృతదేహమై తేలాడు. వివరాలు.. తనను ఇంటి పక్కన ఉన్న మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనో వేదనకు లోనైన లక్ష్మీనారాయణ నాయక్‌ శనివారం సాయంత్రం హంద్రీ–నీవా కాలువలో దూకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, స్థానికులు ముమ్మర గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల సమీపంలో కాలువలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పరిష్కార వేదికకు  65 వినతులు1
1/2

పరిష్కార వేదికకు 65 వినతులు

పరిష్కార వేదికకు  65 వినతులు2
2/2

పరిష్కార వేదికకు 65 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement