
రైతులు బహిష్కరించడంతో గ్రామసభలో మిగిలిన అధికారులు
భూసేకరణను నిరసిస్తూ గ్రామ సభను బహిష్కరించిన రైతులు
వివిధ గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతుల రాస్తారోకో
బాబూ..వ్యవసాయం నుంచి తమను దూరం చేయొద్దని వేడుకోలు
హిందూపురం: ‘‘ఈ భూములను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నా. ఇప్పుడు వీటిని లాక్కుంటే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకే మా ప్రాణాలైనా వదులుతాం.. భూములు మాత్రం ఇవ్వబోం’’ అని రైతులు తేల్చిచెప్పారు. పరిశ్రమలకు భూ సేకరణ కోసం సోమవారం రెవెన్యూ అధికారులు హిందూపురం మండలం నందమూరి నగర్ గ్రామంలో రైతులతో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఒక్క హిందూపురం మండలంలోనే సుమారు 3 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రైతులు తమ పొలాలు లాక్కొవద్దంటూ అధికారులను వేడుకున్నారు. పరిశ్రమల పేరు చెప్పి తమను రోడ్డున పడేయవద్దంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అయినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.
దీంతో రైతులు గ్రామ సభను బహిష్కరించి రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న హిందూపురం మండలం మలుగూరు, చలివేందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి, బాలంపల్లి, జంగలపల్లి, బీరేపల్లి, తిమ్మగానపల్లి, కొండూరు గ్రామాల రైతులు కూడా వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ‘పరిశ్రమలు వద్దు... వ్యవసాయం ముద్దు’, ‘అధికారుల వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన రైతులకు రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...రైతే దేశానికి వెన్నముక అంటారు.. అలాంటి రైతుల పొలాలను లాక్కోడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబూ వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయకు’ అంటూ మొరపెట్టుకున్నారు. అయినా భూసేకరణ చేయాలంటే రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం... పొలాలకు మూడింతల ధర చెల్లించాలని కోరారు.
పంట భూములు తీసుకుంటే సహించం
పరిశ్రమలు అవసరమే అయినా.. ఏడాదికి మూడు పంటలు పండే భూములను తీసుకుంటామంటే సహించబోమని రైతు సంఘం నాయకులు తేల్చి చెప్పారు. కూటమి సర్కార్ అభివృద్ధి పేరుతో వ్యవసాయమే జీవనాధారంగా బతికే వందలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే దుస్థితి కల్పిస్తోందని మండిపడ్డారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

రాస్తారోకో చేస్తున్న వివిధ గ్రామాల రైతులు, రైతు సంఘం నాయకులు