
బంగారం వ్యాపారికి బురిడీ
ఉరవకొండ: స్థానిక సీఎస్‌ఐ చర్చి సమీపంలోని నిజాముద్దీన్ జ్యువెలరీ నిర్వాహకులు దాదాఖలందర్, తాజుద్దీన్‌ను సోమవారం ఓ మహిళా బురిడీ కొట్టించి రూ1.40 లక్షల విలువ చేసే బంగారం, నగదు తీసుకెళ్లింది. వివరాలు.. నిజాముద్దీన్ జ్యువెలరీ దుకాణానికి సోమవారం ఉదయం ఓ మహిళ వెళ్లింది. పక్కనున్న వ్యక్తిని తన భర్తగా పరిచయం చేస్తూ తమది నెరిమెట్ల గ్రామం అని, కుమార్తె వివాహం పెట్టుకోవడంతో తన వద్ద ఉన్న ఒకటిన్నర తులం బంగారు గొలుసు తీసుకుని కొంత నగదు, జత కమ్మలు ఇవ్వాలని కోరుతూ గొలుసు తీసిచ్చింది. దానిని పరీక్షించిన అనంతరం మేలిమి బంగారమేనని నిర్ధారించుకున్న వ్యాపారి దాదాఖలందర్... ఆ గొలుసుకు రూ.50 వేల నగదుతో పాటు ఆరు గ్రాముల బరువున్న కమ్మలు వస్తాయని తెలిపాడు. తానిచ్చిన బంగారు గొలుసును సదరు మహిళ చేతికి తీసుకుని అమ్మాయి పెళ్లి కాబట్టి కాస్త చూసి ఇవ్వాలంటూ బేరం ఆడింది. పాత బంగారం కావడంతో ఆ ధర వస్తోందని వ్యాపారి చెప్పడంతో చివరకు సరేనంటూ బ్యాగ్ లో ఉంచిన గొలుసు తీసిచ్చి.. వ్యాపారి ఇచ్చిన రూ.50 వేల నగదు, జత కమ్మలు తీసుకుని వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆ గొలుసును మరోసారి పరీక్షించగా అది నకిలీదని తేలింది. దీంతో మహిళ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ టీవీ కెమెరా ఫుటేజీల్లో సదరు మహిళా అసలైన బంగారు గొలుసు స్థానంలో నకలీ గొలుసు మారుస్తున్న దృశ్యం స్పష్టంగా నిక్షిప్తమైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వ్యాపారి తెలిపాడు.
నకిలీ గొలుసు ఇచ్చి రూ.1.40 లక్షలు చేజిక్కించుకున్న వైనం