ధర్మవరం రూరల్: మండలంలోని గొళ్లపల్లి వద్ద సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థులు హబీబుల్లా, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు... పుట్టపర్తికి చెందిన హబీబుల్లా, రాజేష్... అక్కడి మంగళకర కాలేజీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదుతున్నారు. వీరిద్ధరూ వ్యక్తిగత పనిపై ధర్మవరం – చిగిచెర్ల మీదుగా అనంతపురానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. గొళ్లపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒంటరి వృద్ధుడి మృతి
తనకల్లు: మండలంలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్ని నది వద్ద వెంకటప్ప(60) మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు. అమడగూరు మండలం పూలకుంటపల్లికి చెందిన వెంకటప్ప పదేళ్లుగా కొక్కంటిక్రాస్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనులు, చిన్నపాటి కూలీ పనులతో జీవనం సాగించేవాడు. అయితే సోమవారం పాపాగ్ని నది పక్కన మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కోటపల్లి వీఆర్వో గంగాధర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా వృద్ధుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
వివాహిత బలవన్మరణం
హిందూపురం: స్థానిక సీపీఐ కాలనీలో నివాసముంటున్న వివాహిత ఆస్మా (28) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త ఖాజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖాజా చెడు వ్యసనాలకు బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆస్మా సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వలస కార్మికుడి మృతి
ధర్మవరం అర్బన్: స్థానిక మారుతీనగర్‌లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకు పైనుంచి జారి పడి వలస కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం పిడింగొయ్య గ్రామానికి చెందిన గెడ్డం రాజ్‌కుమార్(39) 15 రోజుల క్రితం వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేసేందుకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌పై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజ్‌కుమార్ తమ్ముడు గెడ్డం ప్రసాద్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.