
యూరియా కోసం తప్పని తిప్పలు
రొద్దం: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. రెండు నెలలుగా బస్తా యూరియా కోసం రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఇక ఈ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ఉన్న సవిత అన్నదాత ఆక్రందన వినిపించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఎప్పటిలాగే పంటల సాగుకు అవసరమైన యూరియా కోసం బారులు తీరుతూనే ఉన్నారు.
సగం మందికి కూడా అందలేదు
రొద్దంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని గ్రామాల రైతులకు శనివారం యూరియా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాల రైతులు శనివారం తెల్లవారుజామునుంచే పీఏసీఎస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు. గంటల తరబడి వేచి చూశారు. అయినా అధికారులు రైతుకు రెండు బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో సగం మంది రైతులకు యూరియా అందలేదు. వారంతా కూటమి సర్కార్‌పై దుమ్మెత్తి పోశారు. మంత్రికి కూడా తమ కష్టాలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పీఏసీఎస్ సీఈఓ వెంకటేసులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం 280 బస్తాల యూరియా వచ్చిందని, శనివారం 140 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశామని తెలిపారు.
పోలీసు భద్రత నడుమ యూరియా పంపిణీ చేస్తున్న దృశ్యం
రొద్దం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలో రైతుల పడిగాపులు
రొద్దంలో తెల్లవారుజాము నుంచే క్యూలో రైతుల పడిగాపులు
మంత్రి సవిత ఇలాకాలో అన్నదాతలకు అష్టకష్టాలు
ఇబ్బందులు పడుతున్నాం
పంటలకు ఇప్పుడు యూరియా చాలా అవసరం. రెండు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పీఏసీఎస్‌ల ఎదుట బారులు తీరినా యూరియా దొరకడం లేదు. రోజూ యూరియా కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో పనులు కూడా చేసుకోలేక పోతున్నాం. పంట పండించే రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేరా...? – సినిమా నారాయణ, రైతు, రొద్దం

యూరియా కోసం తప్పని తిప్పలు

యూరియా కోసం తప్పని తిప్పలు