
‘ఈ–క్రాప్’ నమోదు వేగవంతం చేయండి
కదిరి అర్బన్: ‘ఈ–క్రాప్’ నమోదు వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కదిరిలోని కుటాగుళ్ల, ముత్యాలచెరువులో పర్యటించారు. ఈ సందర్భంగా కుటాగుళ్లలో రైతు సిద్దప్ప సాగు చేస్తున్న పంట వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారా... అని స్థానిక వ్యవసాయాధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముత్యాలచెరువులోని తిరుపాల్‌నాయక్ మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు కూడా ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలను ‘ఈ–క్రాప్’లో నమోదు చేయించుకోవాలని, లేకపోతే ప్రభుత్వం అందించే సబ్సిడీలు, పంట నష్టపరిహారం వర్తించబోవన్నారు. ఏడీఎం సనావుల్లాతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
రాయితీ జమ అయ్యేలా చూడండి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రశాంతి నిలయం: జిల్లాలోని అర్హులందరికీ ‘దీపం –2’ పథకం రాయితీ జమయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సీఎస్‌డీటీలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘దీపం–2’ పథకం కింద రాయితీ జమకానీ, ట్రాన్షక్షన్ ఫెయిల్ అయిన కేసులపై ఆరా తీశారు. రాయితీ జమ కాని ‘దీపం–2’ లబ్ధిదారుల వివరాలు వెంటనే అందించాలని ఆదేశించారు. అర్హులందరికీ రాయితీ జమ అయ్యేలా గ్యాస్ ఏజెన్సీలు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎస్‌డీటీలు కూడా ఈ అంశంపై ప్రతివారం సమీక్షించాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, ఎల్‌డీఎం రమణకుమార్, సీఎస్‌డీటీలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
రెండోదశ డిగ్రీ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం నుంచి రెండోదశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్కియాలజీ, హిస్టరీ, స్టాటిస్టిక్స్, జర్నలిజం, క్రియేటివ్ రైటింగ్, డేటా సైన్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, మ్యాథమెటిక్స్, అనిమల్ బయోటెక్నాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక ఉంటుంది.