
ఆత్మహత్య కాదు.. హత్యే
● మృతుడి బంధువుల ఆరోపణ
● అంత్యక్రియలను అడ్డుకున్న వైనం
కొండాపురం: మండలంలోని సాయిపేట బీసీ కాలనీలో బండారు సుధాకర్ (51) ఉరేసుకొని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని కొండాపురం పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే ఇది హత్యేనని ఆరోపిస్తూ గ్రామంలో శనివారం జరగాల్సిన అంత్యక్రియలను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. మృతుడి సో దరులు, బంధువులు బండారు ప్రసాద్, రమేష్, శ్రీనివాసులు, కొండయ్య, మల్లె చిన్నయ్య, మరికొందరు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో సానంగుల రవితో సుధాకర్ భార్య మల్లేశ్వరికి వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో ఆమె అన్న తురకా మాధవ, సునీత, లక్ష్మీకాంతమ్మ, వేణు మరికొందరితో కలిసి సుధాకర్‌పై దాడి చేసి ఉరేసి చంపారని ఆరోపించారు. కొంత మంది అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరించారని చెప్పారు. రామాలయం వద్ద సుధాకర్‌పై మల్లేశ్వరి బంధువులు దాడి చేస్తుంటే గ్రామం మొత్తం చూశారని, అదే రోజు రాత్రి హతమార్చారని ఆరోపించారు. వీరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొండాపురం ఎస్సై మాల్యాద్రి.. గ్రామానికి చేరుకొని నచ్చజెప్పేందుకు యత్నించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.