
ఇసుక, మట్టి మా సొంతం
కోవూరు: పెన్నానదిలో అసలు ఇసుక తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేదు. పెన్నానదిలో ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతితోనే జిల్లా మైనింగ్, జలవనరుల శాఖ అనుమతివ్వాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ వరకు నదుల్లోనే కాదు.. వాగుల్లో కూడా ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉంది. అయినా అధికార పార్టీ నేతలకు ఇవేమి పట్టడం లేదు. పర్యావరణ, వాల్టా చట్టం నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ నేతలు పెన్నానదిని కుళ్లబొడిచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంటే మైనింగ్, జలవనరులు, రెవెన్యూ, పోలీస్ శాఖలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిత్యం 100 ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా
మండలంలోని జమ్మిపాళెం వద్ద పెన్నానది నుంచి నిత్యం 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బావుల్లాంటి గోతులు పెట్టి ఇసుక తవ్వేయడంతో ప్రమాదకర స్థాయిలో గుంతలు ఏర్పడుతున్నాయి. పెన్నానదిలో ఇసుక తవ్వకాలపై ప్రశ్నిస్తే మాఫియా బహిరంగంగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు అధికారులు ఎవరు మా జోలికి రారు, పెన్నానదిలో ఉండే ఇసుక, మట్టి మాకే సొంతం. మాకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. మా ఇసుక ట్రాక్టర్లు, మట్టి ట్రాక్టర్లకు ఎవరైనా అడ్డొచ్చినా ఒప్పుకోం.. మమ్మల్ని కాదని నదిలో దిగారంటే ట్రాక్టర్లూ సీజ్ అవుతాయి’ అంటూ బాహాటంగా హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
పర్యావరణంపై ఆందోళన
పెన్నానదిలో ఇసుక తవ్వకాల విషయం అటుంచితే.. రేయింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు రాకపోకలతో రణగోణ ధ్వనులతో తమకు ప్రశాంతత కొరవడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు దెబ్బతిన్నాయని, వర్షం పడితే బురద, ఎండితే దుమ్ముతో అల్లాడిపోతున్నామంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలతో తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
కప్పం కట్టు.. ఇసుక తోలుకో..
జమ్మిపాళెం పరిధిలో ఉండే ట్రాక్టర్లు మాత్రమే పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు అనుమతి ఇస్తున్నారు. ఎవరైనా బయట వ్యక్తులు ఇసుక కావాలంటే.. ఇసుక విలువ కప్పం కడితేనే అనుమతిస్తామని, లేదంటే సీజ్ చేయిస్తామని అధికార పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు ఈ స్థాయిలో బరితెగించి వ్యవహరిస్తున్నారంటే అధికార వ్యవస్థలు వీరికి ఏ విధంగా సాగిలపడుతున్నాయో అర్థమవుతోంది.
జమ్మిపాళెం నుంచి విచ్చలవిడిగా అక్రమ రవాణా
మాఫియాకు అధికారం అండదండలు
మామూళ్ల పేరుతో రూ.లక్షల్లో వసూళ్లు
చూసీ చూడనట్లుగా అధికారులు
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని జమ్మిపాళెం ప్రాంతంలో పెన్నానదిని అడ్డాగా చేసుకుని కుళ్లబొడిచేస్తున్నారు. ఏ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పెన్నానది మాది.. ఇసుక, మట్టి మా సొంతమే.. ఎవరైనా అడ్డొస్తే మీ సంగతి తేలుస్తామంటూ స్థానిక గ్రామస్తులను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. స్థానికులు తమ ఇంటి అవసరాలకు కూడా ఇసుక తరలించడానికి వీల్లేదంటూ, తమను కాదని నదిలోకి దిగితే సీజ్ చేయిస్తామంటూ బాహాటంగానే హెచ్చరిస్తున్నారంటే అధికార వ్యవస్థలు అధికార పార్టీ నేతలకు ఏ విధంగా సాగిలపడి ఊడిగం చేస్తున్నాయో అర్థమవుతోంది.