
ప్రైవేట్ ట్రావెల్స్‌ల్లో తనిఖీలు
● 115 కేసుల నమోదు
● రూ.11.41 లక్షల జరిమానా వసూలు
నెల్లూరు (టౌన్)/వెంకటాచలం: దసరా పండగ నేపథ్యంలో సూదూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు రోజులుగా జిల్లాలోని వెంకటాచలం, కోవూరు, బోగోలు ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న 115 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆయా బస్సుల నుంచి రూ.11.41 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ సందర్భంగా డీటీసీ చందర్ మాట్లాడుతూ పండగల పేర్లు చెప్పి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సుల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు బాలమురళీ, రఫీ, పవన్‌కార్తీక్, ఏఎంవీఐలు స్వప్నిల్‌కుమార్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు
విక్రయిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులను అరికట్టేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అంతర్గత తనిఖీ బృందాలను నియమించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, అక్రమ యూరియా నిల్వలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ సమస్యలపై ఫిర్యాదులు ఉన్నట్లయితే రైతులు వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 83310 57285కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు తనిఖీలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. డీలర్లు, గోదాములు, స్టాక్ పాయింట్లలో యూరియా సరఫరా, నిల్వలు, వినియోగంపై సమగ్ర స్టాక్ వెరిఫికేషన్‌న్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అక్రమ రవాణా, అనధికార వినియోగాన్ని అరికట్టడం, క్రమం తప్పకుండా ఫీల్డ్ స్థాయి తనిఖీలు చేయడం, వ్యవసాయ అధికారులను సమన్వయం చేస్తూ పర్యవేక్షణ చేయడం ఈ ప్రత్యేక బృందాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేటి నుంచి అండర్–19
ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి ఎంపికలు
నెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం నుంచి జరగనున్నట్లు డీవీఈఓ కృష్ణారెడ్డి, ఆర్‌ఐఓ వరప్రసాదరావు, ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాటూరు వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం జరుగుతాయన్నారు. 7న అథ్లెటిక్స్, 8న ఖోఖో, 9న కబడ్డీ, 10న వాలీబాల్, సాఫ్ట్‌బాల్, హాకీ, 11న హ్యాండ్‌బాల్, 12న షటిల్ బ్యాట్మింటిన్, 13న క్రికెట్ ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొను విద్యార్థులు 2007 జనరవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,412 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,058 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందుగా క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

ప్రైవేట్ ట్రావెల్స్‌ల్లో తనిఖీలు

ప్రైవేట్ ట్రావెల్స్‌ల్లో తనిఖీలు