
నిలిచిన 104 సేవలు
● వైద్యులు సమ్మెలో ఉండటమే కారణం
● హాజరుపట్టికలో మాత్రం సంతకాలు
● ఏఎన్‌ఎంల ఆన్‌లైన్
రిపోర్టులు కూడా బంద్
సాక్షి టాస్క్‌ఫోర్స్: గ్రామాల్లో 104 వాహన సేవలు నిలిచిపోయాయి. కందుకూరు మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యులు సమ్మెలో ఉన్నారు. దీంతో రోజుకు ఒక గ్రామానికి వెళ్లాల్సిన 104 వాహనం ఆగింది. ఆయా గ్రామాల్లోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యసేవల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు లేకపోవడంతో ఉన్నతాధికారులు సేవలను పూర్తిగా ఆపేశారు. వైద్యులు లేకపోయినా ప్రతి సచివాలయం పరిధిలో ఒక విలేజ్ క్లినిక్ ఉంటుంది. అందులో ఎంఎల్‌హెచ్‌పీ, సచివాలయ ఏఎన్‌ఎం, 104 వాహన సిబ్బంది ఉంటారు. వారి ద్వారా కూడా మందులిచ్చే అవకాశం ఉంది. కానీ అలా జరగడం లేదు.
సంతకాలు మాత్రం పెడుతూ..
ఇదిలా ఉండగా వైద్యులు సమ్మెలో ఉంటూ కూడా విధుల్లో ఉన్నట్టు హాజరుపట్టికలో సంతకాలు చేస్తుండటం విశేషం. గత నెల 26వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. అయితే విధులకు హాజరైనట్లు సంతకాలు చేసి ఉన్నారు. జీతం తీసుకునేందుకు వారే చేశారా? లేదా పీహెచ్‌సీలోని సిబ్బంది చేశారా? అనే విషయంపై అనుమానాలున్నాయి. సమ్మెలో ఉంటూ విధులకు హాజరైనట్లు సంతకాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. డాక్టర్లకు సెప్టెంబర్ నెలలో పూర్తి జీతం వస్తే ఉన్నతాధికారులు కూడా పరిశీలించకుండా ఇచ్చినట్లవుతుంది. గత నెలలో ఓ ఏఎన్‌ఎం అనారోగ్యం కారణంగా చికిత్స పొందింది. ఆమ్మెకు సంబంధిత జీతంతోపాటు ఎర్న్ లీవ్‌లకు సంబంధించి బిల్లులు చేయలేదు. ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగికి జీతం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు రోజూ ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. వారి చేత డాక్టర్లు నమోదు చేయించడం లేదు.
ఇబ్బంది పడుతూ..
ప్రస్తుతం సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కందుకూరు అర్బన్ పీహెచ్‌సీ నుంచి వైద్యురాలిని ఇన్‌చార్జిగా వేసినప్పటికి 104 సేవలు గ్రామాల్లో అందడం లేదు. కందుకూరు మండలంలో 19 పంచాయతీలు, 13 సచివాలయాలున్నాయి. రోజూ 104 వాహనం ద్వారా రోగులను పరీక్షించాల్సి ఉంది. కానీ దీనికి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టలేదు.

నిలిచిన 104 సేవలు