
వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు
నెల్లూరు(క్రైమ్): విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.80 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో సుబ్బమ్మ, వెంకయ్య దంపతులు ఉంటున్నారు. ఆదివారం వారు ఇంట్లో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దంపతులు బయటకు పరుగులు తీశారు. పూరిల్లు కావడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఇన్‌చార్జి ఏడీఎఫ్‌ఓ శ్రీనాథ్‌రెడ్డి ఆదేశాలతో లీడింగ్ ఫైర్‌మెన్ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
● నవాబుపేటలో జగన్‌మోహన్ నివాసముంటున్నారు. అతని ఇంటి వెనుకున్న గదిలో పాత సామగ్రి, చెక్క వస్తువులున్నాయి. ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. రూ.30 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
రైలు కిందపడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వే గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. సిబ్బంది సమాచారం మేరకు నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఆమె కేసు నమోదు చేశారు.
స్నేహితులతో వెళ్లి..
● అదృశ్యమైన బాలుడు
● ఆచూకీ కనుగొన్న పోలీసులు, గ్రామస్తులు
సోమశిల: ఓ బాలుడు అడవిలో అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులు గాలించి గుర్తించిన ఘటన ఆదివారం అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని ఆమనిచిరివెళ్ల గ్రామానికి చెందిన కూసుపాటి కొండయ్య కుమారుడైన వెంకటకృష్ణ పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. భోజనాల తయారు చేసేందుకు కట్టెల కోసం వెళ్లి తిరిగిరాలేదు. అక్కడున్న యువకులు గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. అందరూ ఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. పల్లిపాడు గ్రామం వద్ద బాలుడి ఆచూకీ లభ్యమైందని ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎటువంటి హాని కలగకుండా వెంకటకృష్ణ బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
రాళ్లపాడు ప్రాజెక్ట్‌లో
మృతదేహం
లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్‌లో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. కొత్త స్పీల్‌వే పాత గేట్లకు మధ్యలో ఉన్న జనరేటర్ రూమ్ వద్ద నీటిలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై నారాయణ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్ట్‌లో నీరు లోతుగా ఉన్నందున బోటు సాయంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీస్తేనే ఇది హత్య, ఆత్యహత్యా అనేది నిర్ధారణ అవుతుందని పోలీసులు వెల్లడించారు.

వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు