
రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడు సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగి.. తెలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్‌ను ధరించి ఉన్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై హరిచందన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాల కోసం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఆరాతీస్తున్నారు.
రైల్లోంచి జారిపడి..
కొడవలూరు: రైల్లోంచి జారిపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తలమంచి రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే హెచ్‌సీ వెంకటేశ్వరరావు వివరాల మేరకు.. తలమంచి రైల్వేస్టేషన్ వద్ద గల 190 – 25ఏ – 27 పోస్టుల మధ్య ఎగువ లైన్‌లో రైల్లోంచి జారిపడటంతో విజయవాడకు చెందిన కందుకూరి రమేష్ (30) మృతి చెందారు. మృతుడు రెండు చొక్కాలు, రెండు ప్యాంట్లను ధరించి ఉన్నారు. రైల్లో యాచించే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడి వద్ద ఆధార్ కార్డు లభించిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మకూరులో అనుమానాస్పద మృతి..?
ఆత్మకూరు రూరల్: పట్టణంలోని బీఎస్సార్ సెంటర్ సమీపంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఘటన అనుమానాస్పద మృతి అనే ప్రచారం జరుగుతోంది. ఈద్గా ఆవరణలో చోటుచేసుకున్న ఈ ఘటనను ప్రముఖులు, ఇతరుల ఒత్తిడితో సాధారణ మరణంగా పోలీసులు చిత్రీకరిస్తున్నారనే చర్చ సాగుతోంది. మృతుడి కుటుంబసభ్యులు సైతం సాధారణ మరణంగానే పోలీసులకు వాంగ్మూలమిచ్చార ని తెలుస్తోంది. కాగా ఈ విషయమై ఆత్మకూరు సీఐ గంగాధర్‌ను సంప్రదించగా, అన్ని కోణాల్లో విచారించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు.