
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
● జన విజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్
సమావేశంలో నేతలు
నెల్లూరు(బృందావనం): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలి. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలి’ అని పలువురు నేతలు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని వర్థమాన సమాజం హాల్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగిది. జిల్లా హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలకు చెందిన వారు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపించేలా ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. పీపీపీ విధానం ద్వారా ప్రజలకు ఆరోగ్యం, పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరంచేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్థలు ప్రజలను ఏ విధంగా కాపాడాయో వెల్లడించారు. ప్రజలకు అవగాహన కలిగించి వారిని చైతన్యపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపాందించాలన్నారు. సమావేశంలో నాయకులు బుజ్జయ్య, గాలి శీనయ్య, నారాయణ, డాక్టర్ ఖాదర్‌బాషా, డాక్టర్ ఎండీ షఫీ, ఎంవీ చలపతి, ఎ.విజయకుమార్, విద్యాచరణ్, కృష్ణ, ఎన్.శంకరయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.