‘మీన’మేషాలు!
హయత్‌నగర్: వర్షాలు విరివిగా కురిసి.. చెరువులు పూర్తిగా నిండితే ముందుగా సంబరపడేది రైతులు, ఆ తర్వాత మత్స్యకారులే. చెరువు నీటిలో చేపలు పెంచుకుంటే ఏడాదికి సరపడా ఉపాధికి ఢోకా ఉండదని వారి ఆశ. ఆశించినట్టుగానే ఈ ఏడాది ప్రకృతి కనికరించి వర్షాలు బాగా కురవడంతో చెరువులు పూర్తిగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. అయినా చేపపిల్లల పంపిణీలో అధికారులు చేస్తున్న తాత్సారం మత్స్యకారుల ఆశకు గండి కొడుతోంది.
పంపిణీపై సందేహాలు
జిల్లాలో ఇప్పటివరకు ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టక పోవడంతో మత్స్యకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లా పరిధిలో రెండు వందలకు పైగా మత్స్యపారిశ్రామిక అభివృద్ధి సొసైటీలు ఉన్నాయి. సుమారు 10 వేల కుటుంబాలకు పైగా ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి చెరువుల్లోకి నీరు వస్తున్నా సొసైటీలకు చెపపిల్లలు ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జూలై నుంచే చేపల సీడ్ పంపిణీ చేయాల్సిన మత్స్యశాఖ ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. దీంతో అసలు చేపలు పంపిణీ చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేపిల్లల పంపిణీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


