డాక్టరేట్‌ సాధించిన గిరిపుత్రుడు | - | Sakshi
Sakshi News home page

డాక్టరేట్‌ సాధించిన గిరిపుత్రుడు

Oct 8 2025 8:11 AM | Updated on Oct 8 2025 8:11 AM

డాక్టరేట్‌ సాధించిన గిరిపుత్రుడు

డాక్టరేట్‌ సాధించిన గిరిపుత్రుడు

తాండూరు టౌన్‌: కృషి ఉంటే మనుషులు రుషులవుతారని నిరూపించాడు ఓ గిరిపుత్రుడు. పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి డాక్టరేట్‌ సాధించాడు బషీరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన విఠల్‌ రాథోడ్‌. తల్లి నాగిబాయి, తండ్రి రాము నాయక్‌ ద్వితీయ పుత్రుడైన విఠల్‌ రాథోడ్‌ చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి కనపరిచే వాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా, పట్టుదలతో చదివి ఏకంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డి పట్టా సాధించాడు. పేదరికం ఉన్నత చదువులకు అడ్డంకి కాదని నిరూపించాడు. ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఈడీ పూర్తి చేసిన ఆయన, 2020లో హెసీయూ నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి అడ్మిషన్‌ సాధించాడు. హెచ్‌సీయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గీతా గోపీనాథ్‌ పర్యవేక్షణలో శ్రీస్వదేశీ విద్యార్థుల జీవన నైపుణ్యాలు, నియంత్రణ స్థితికి సంబంధించి ద్వితీయ స్థాయిలో మానసిక సామాజిక సామర్థ్యంశ్రీ అనే అంశంపై ఐదేళ్ల పాటు పరిశోధన చేసి 2024లో థీసిస్‌ సమర్పించారు. అతని పరిశోధనకు గాను మంగళవారం హైదరాబాద్‌లో హెచ్‌సీయూ వైస్‌ చాన్స్‌లర్‌ బీజే రావు చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విఠల్‌ రాథోడ్‌ దేశంలోనే అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన యూజీసీ నెట్‌లో అర్హత సాధించి రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికై నెలకు రూ. 53వేల పారితోషకాన్ని ఐదేళ్ల పాటు తీసుకున్నారు. అలాగే జనవరి 2023లో దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌ టౌన్‌లో బ్లెండెడ్‌ లర్నింగ్‌, ప్రతిభావంతమైన అభ్యసానికి ఒక హైబ్రిడ్‌ బోధనా నమూనా అనే అంశంపై ప్రెజెంటేషన్‌ ఇచ్చి పత్ర సమర్పణ చేయడం విశేషం. డాక్టరేట్‌ సాధించిన విఠల్‌ రాథోడ్‌ను గ్రామస్తులు, సహచరులు, కుటుంబ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు.

ఓయో రూంలో యువకుడి ఆత్మహత్య

కుషాయిగూడ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌ష్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జై జవాన్‌ కాలనీకి చెందిన మన్నె నరేందర్‌ (30) తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఏఎస్‌రావునగర్‌లోని సిఎంఆర్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసిన నరేందర్‌ ఈ మధ్యే పనికి వెళ్లడం మానేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టి నష్టపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో పెరిగిన ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఈసీఐఎల్‌లోని ఓయో రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

మూసాపేట: భార్యను హత్య చేసిన కేసులో న్యాయస్థానం మంగళవారం భర్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి...కర్ణాటక రాష్ట్రం, బీదర్‌ జిల్లా మదర్గాన్‌ గ్రామానికి చెందిన కుల్బే సంతోష్‌ (46) భార్య సురేఖతో పాటు కూకట్‌పల్లి, మూసాపేట, కై త్లాపూర్‌లో నివా సం ఉంటూ కూలి పని చేసేవాడు. సంతోష్‌ నిత్యం మద్యం సేవించి భార్యను మానసికంగా, శారీకంగా వేధించేవాడు. 2022 మే 16వ తేదిన సంతోష్‌ భార్యను గొంతు కోసి ఆమె మెడ నుంచి బంగారం పుస్తె, గుండ్లు తీసుకుని వెళ్లాడు. ఆమె చికిత్స పొందుతూ 19వ తేదిన గాంధీ ఆసుపత్రిలో చనిపోయి ంది. 16వ తేదీన కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. భార్య గొంతు కోసి చంపినందుకు దోషిగా నిర్ధారిస్తూ కూకట్‌పల్లిలోని మేడ్చల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి, ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్చునిచ్చారు.

కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై కేసు నమోదు

వెంగళరావునగర్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్‌ నాయకుడు నవీన్‌యాదవ్‌పై మధురానగర్‌ పీఎస్‌లో కేసునమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నవీన్‌యాదవ్‌ ఫేక్‌ ఎపిక్‌ (ఓటరు) కార్డులను పంపిణీ చేశారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఆసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి రజినీకాంత్‌రెడ్డి మధురానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను ఉల్లంఘిస్తూ పౌరులకు చట్ట విరుద్ధంగా ఎపిక్‌ కార్డుల పంపిణీ జరిగిందని, ఇదే నిజమైతే అవి నేరం కిందకు వస్తాయని, ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఆర్‌ఓ ఫిర్యాదుపై స్పందించిన ఇన్‌స్పెక్టర్‌.. కాంగ్రెస్‌ నాయకుడు నవీన్‌యాదవ్‌పై బీఎన్‌ఎస్‌ 170, 171, 174 తో పాటుగా ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement