పొరపాట్లకు తావివ్వొద్దు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్థానిక ఎన్నికల ప్రక్రియను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండలస్థాయి అధికారులు ఒక టీంగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభ్యర్థులు సభలు, ర్యాలీలు, సమావేశాల కోసం అనుమతి పొందాల్సి ఉంటుందని, సంబంధిత సమాచారాన్ని ఖర్చుల పర్యవేక్షణ బృందానికి అందించాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ప్రొసైడింగ్, సహాయ ప్రొసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని డీసీపీ సునీతారెడ్డి చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


