
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అనేక మార్లు అనుమతి లేదని, చివరికి గత్యంతరం లేక అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారు. పెట్రోల్ బంక్ లో పెట్రోలు కొట్టకుండా నిర్భంధిస్తున్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడడం బాధాకరం. నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.
ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాలు మాదిరిగా కొందరు పోలీసులు పని చేస్తున్నారు. మీ లాఠీతో జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు. చిత్తూరు మామిడి పంటను ధర లేక రోడ్ల మీద పడవేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక వాహనాలను తనిఖీ చేసి, కొన్ని వాహనాలకు నోటీసులు ఇచ్చారు.
మామిడి రైతులను పరామర్శిస్తే తప్పు ఏంటి? మీకు ఎందుకు అంత భయం. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు.. మేము ఎక్కడ జన సమీకరణ చేయటం లేదు. బుర్ర లేని నారా లోకేష్ మాటలు ఐపీఎస్ అధికారులు వినటం బాధాకరం. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు ఒక్కొక్కటి వికటిస్తున్నాయి. ప్రజలకు మీరు మంచి చేస్తే భయం ఎందుకు. రాష్ట్ర డీజీపీ మాకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. అందుకే ఆయనకు మళ్లీ పోస్టింగ్ పొడిగిస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో 113మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారు.

కూటమి మంత్రులు పేకాట క్లబ్లు నడుపుతున్నారు.రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తే, కూటమి ప్రభుత్వం మద్యం ప్రజలకు చేరువ చేస్తుంది. అమరావతి రాజధాని కోసం ఇప్పటికే తీసుకున్న భూములకు న్యాయం చేయలేదు. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ కాదు మమల్ని రానివ్వాల్సింది.. ప్రజలు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. కూటమి పెడుతున్న అక్రమ కేసుల కోసం బస్సులు వేసుకుని పిక్నిక్ కి వెళ్లినట్లు వెళ్లాల్సి వస్తుంది. కూటమికి ఏ కేసులో మెటీరియల్ లేదు. బోనులో పెట్టి మమల్ని సింహాలను చేస్తున్నారు. కూటమి మరో ఏడాది పాలన చూస్తే ప్రజలు ఛీ కొడతారు’ అని ఘాటు విమర్శలు చేశారు.