
హామీలు గుర్తుచేసేందుకే ‘బాకీకార్డు’
రామగిరి(మంథని): అమలుకు సాధ్యంకాని హామీలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే విస్మరించిందని మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ‘కాంగ్రెస్ బాకీకార్డు’ ఉద్యమం ప్రారంభించిందన్నారు. కల్వచర్ల గ్రామంలో సోమవారం గడపగడపకూ తిరుగుతూ బాకీకార్డు గురించి ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వాటిని మరిచిపోయారనే భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు జాపతి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు నాగెల్లి సాంబయ్య, రవీందర్, కుమార్ యాదవ్, సైండ్ల సత్యనారాయణ, రేండ్ల అశోక్, బొంకూరి పోచం, మల్యాల మోహన్, మెట్టు కిష్టయ్య, మొసలి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.