స్థానికం.. సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానికం.. సందిగ్ధం

Oct 7 2025 3:59 AM | Updated on Oct 7 2025 3:59 AM

స్థానికం.. సందిగ్ధం

స్థానికం.. సందిగ్ధం

షెడ్యూల్‌ విడుదలైనా తొలగని ఉత్కంఠ 8న హైకోర్టు తీర్పుపైనే అందరిచూపు తేల్చిన రిజర్వేషన్లు నిలేచేనా? అని అందరిలోనూ అనుమానాలు ముందస్తు ఖర్చుకు వెనుకడుగు వేస్తున్న ఆశావహులు ఆశలు వదులుకోని జనరల్‌ అభ్యర్థులు

సాక్షి పెద్దపల్లి: ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినా.. ఆశావాహుల్లో ఉత్కంఠ తొలగడంలేదు. రిజర్వేషన్లు ప్రకటించినా.. అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కలిసోచ్చిన వారు ప్రచారం చేసుకోవాలో.. వద్దో తెలియక.. డైలామాలో పడిపోయారు.. రిజర్వేషన్‌ కలిసిరాని వారు కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందనే ధీమాలో ఉన్నారు.

రోజులు లెక్కబెట్టుకుంటున్నారు..

సోమవారం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కోట్టివేసినా.. ఈనెల 8న హైకోర్టు తీర్పుకోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఖరారైన స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న వారికి రిజర్వేషన్లు చెల్లుబాటవుతాయా? హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేస్తుందా? అనే విషయంపైనే ఏ నలుగురు కలిసినా పల్లెల్లో చర్చించుకోవడం కనిపిస్తోంది.

హైకోర్టు తీర్పుపైనే అందరి దృష్టి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై ఈనెల 8న హైకోర్టు విచారణ జరుపనుంది. షెడ్యూల్‌ విడుదల తర్వాత కోర్టులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవంటున్నారు. కానీ.. రాష్ట్రప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపే పలువురు కోర్టును ఆశ్రయించారు. అయితే, షెడ్యూల్‌ ప్రకటించినా.. తాము పిటిషన్‌పై విచారణ చేపడతామని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? లేక అభ్యంతరం చెబుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

కొత్త జీవోనా? పాతదేనా?

ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు గతంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేసి, కొత్తది ప్రకటించక తప్పదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్పుడు గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు 23 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించాలి. అప్పుడు ఎస్సీ, ఎస్టీల స్థానాల సంఖ్య మారకపోయినా, బీసీల స్థానాలు తగ్గి జనరల్‌ స్థానాలు పెరగనున్నాయని అంటున్నారు. దీంతో జనరల్‌ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు తమకు ఇంకా అవకాశం ఉందనే భావనలో ఉన్నారు.

ఖర్చుపై ఆచీతూచీ..

జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ, 263 పంచాయతీ, 2,432 వార్డులు ఉన్నాయి. మొత్తంగా అన్నీకలిపి 2,845 స్థానాలు ఉన్నాయి. ఒక్కోస్థానానికి ముగ్గురు చొప్పున లెక్క వేసుకున్నా దాదాపు 8,535మంది అభ్యర్థులు స్థానిక సంస్థల్లో వివిధ పదవుల కోసం బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ స్థానాలకు రిజర్వేషన్లు కలిసి వచ్చినవారు పండుగ పేరుతో దావత్‌లు ఇవ్వగా, బీసీలకు రిజర్వేషన్‌ కేటాయించిన స్థానాల్లో.. బరిలో నిలిచే ఆశావాహుల్లో పలువురు కోర్టుతీర్పు ప్రతికూలంగా వస్తే ఎట్లా? అనే భావనతో ఖర్చు పెట్టేందుకు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు అందరిచూపు హైకోర్టు తీర్పుపైనే నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement