
జీజీహెచ్‌లో కిక్కిరిసిన పేషెంట్లు
కోల్‌సిటీ(రామగుండం): బతుకమ్మ, దసరా పండుగల సెలవుల్లో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఓపీ విభాగం కాస్త నిశ్శబ్దంగా కనిపించింది. కానీ, సెలవులు ముగిశాక.. సోమవారం ఒక్కరోజే పేషెంట్లు భారీగా తరలివవచ్చారు. వారిరాకతో ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి పెద్దసంఖ్యలో చేరుకోవడం ప్రారంభం కావడంతో రిజిస్ట్రేషన్ కౌంటర్ల నుంచి ఓపీ గదుల వరకు క్యూలు కనిపించాయి. పాత, కొత్త పేషెంట్లతో కలిపి ఒక్కరోజే మొత్తం 1,226 ఓపీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నొప్పులు, ఇతర వ్యాధులతో పండుగ సెలవుల్లో ఓపిక పట్టిన వారు సోమవారం ఆస్పత్రికి తరలివచ్చారు. కొందరికి సాధారణ జ్వరాలు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉండగా, మరికొంతమంది పాత నొప్పులు, అనారోగ్య సమస్య పరిష్కారానికి వచ్చారు. సెలవుల తర్వాత ఒక్కసారిగా రద్దీ పెరగడంతో గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డారు. కొందరైతే వైద్యం పూర్తయ్యేలోపు మధ్యాహ్నం తర్వాత కూడా ఆస్పత్రిలోనే ఉండిపోయారు.