
పత్తిరైతు పరేషాన్
సాక్షి,పెద్దపల్లి: జిల్లాలో ఇటీవల కురిసిన వానలు పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత ఎడతెరపిలేని వర్షా లు అన్నదాతను తెల్లబోయేలా చేశాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌లో కురిసిన భారీవర్షాలకు పత్తి పంట ఎర్రబారింది. ప్రస్తుతం పూత, కాయ, దూదితో కళ కళాడాల్సిన చేన్లు.. ఎక్కడా చూసినా తెగళ్లతో ఎర్రబారి కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, తేమశాతం అధికం కావడంతో చేలలో పదను త గ్గడం లేదు. వర్షపునీరు నిలిచి పత్తికాయలు రాలిపోవడమే కాకుండా మొక్కలు మురిగిపోతున్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నిరకాలుగా అనుకూలిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని, కానీ, అధిక వర్షాలతో 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి కూడా చేతికి వచ్చేట్టు లేదని అంటున్నారు.
రాలుతున్న కాత, పూత
భారీవర్షాలు, ముసురుతో చేలల్లో తేమ ఇంకా ఆరడం లేదు. ఫలితంగా రసం పీల్చే పురుగులు, పచ్చ, తెల్లదోమ, నల్లితో ఆకుముడుత, పండాకు, ఎండాకు వంటి తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. పత్తి పూత, పిందె రాలిపోతుండటంతోపాటు కాయలు ఎర్రబారుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
సీజన్ ఆరంభంతోనే కష్టాలు..
పత్తి విత్తనాలు నాటే దశనుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సీజన్ మొదట్లో వానదేవుడు ముఖం చాటేశాడు. విత్తిన విత్తనాలు భూమిలోనే కలిసిపోయాయి. రెండోసారి కొన్నిచోట్ల మళ్లీ విత్తనాలు వేశారు. ఎరువులు, పురుగులమందులు, కలుపుతీతకు భారీపెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొస్తున్న దశలో భారీ వర్షాలు దెబ్బతీశాయి.
అధిక వర్షాలతో దెబ్బతిన్న తెల్లబంగారం
ముసురు ప్రభావంతో నిలవని పూత, పిందె
చేలల్లో తేమతో చీడపీడల ఉధృతి
ఆకుముడతతో ఎర్రబారుతున్న మొక్కలు
తగ్గనున్న దిగుబడి.. పెట్టుబడిపై ఆందోళన

పత్తిరైతు పరేషాన్