
యూరియా పంపిణీపై అప్రమత్తం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. ఈనెలాఖరు దాకా కొరత రాకుండా చూడా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం వ్యవసాయాధికారులతో యూరి యా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. పంటల సాగు అవసరాలకు యూరియా అందించామని, అధికారులు ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. ఈ నెలాఖరు దాకా యూరియా కోసం వచ్చే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు యూరియా తరలిపోకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అలాగే పంట దిగుబడులు చేతికందే సమయం ఆసన్నమవుతోందని, ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారయంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి, మంథని ఏడీఏలు శ్రీనాథ్, అంజని పాల్గొన్నారు.
న్యూఇండియా పార్టీకి షోకాజ్‌నోటీసు
న్యూ ఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారని కలెక్టర్, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు. నిబంధనల ప్రకారం నియామక ఆడిట్ అకౌంట్స్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. కానీ న్యూఇండియా పార్టీ 2021–22, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు ఆడిట్ వివరాలను సమర్పించని కారణంగా నోటీసు జారీ చేసినట్లు వివరించారు. పార్టీ గుర్తింపు విషయంలో వివరణను బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు.