
కోర్టు భవన సముదాయం పనులు కొలిక్కి వచ్చేనా?
రాఘవాపూర్ శివారులో పదెకరాలు కేటాయింపు
అవసరమైన నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
కుదరని ఏకాభిప్రాయం.. పనుల ఆరంభంలో జాప్యం
ఎటూతేలని జిల్లా కోర్టు భవన సముదాయం పనులు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయస్థానం, సీనియర్, జూనియర్ జడ్జి కోర్టులు అన్నింటినీ ఒకే సముదాయంలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల స్థలం కేటాయించి, నిధులు కూడా మంజూరు చేసింది. అయినా, న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో కోర్టు భవన సముదాయం పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోవడంలేదు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలో కోర్టు భవన సముదాయం నిర్మాణానికి అవసరమైనంత స్థలం అందుబాటులో లేదు. అధికారులు కేటాయించిన స్థలం పట్టణానికి దూరంగా ఉంది. దీంతో కేటాయించిన స్థలంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కోర్టు భవన సముదాయం పనులు కొలిక్కి రావడంలేదు.
కన్నాలలో కాలుష్యం ఉందని..
జిల్లా కోర్టు భవన సముదాయం నిర్మాణానికి అందుగులపల్లి శివారులో (ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలో) రాజీవ్ రహదారి పక్కనే స్థలం కేటాయించారు. ఆ ప్రాంతంలో క్వారీ, క్రషర్లు ఉండడం, వాటినుంచి దుమ్ము, ధూళి వెలువడుతాయని స్థల పరిశీలనకు వచ్చిన న్యాయవాద బృందానికి విన్నవించారు. దీంతో అక్కడ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత స్థల అన్వేషణ మళ్లీ మొదలైంది.
రాఘవాపూర్‌లో నిర్మిస్తారని?
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద కోర్టు భవన సముదాయానికి పదెకరాలు కేటాయించారు. జిల్లా కేంద్రంలోని కోర్టులన్నీ ఒకేసముదాయంలో ఉండ డం, పెద్దపల్లి పట్టణానికి కేవలం మూడు, నాలుగు కిలో మీటర్ల దూరంలోపే ఉండడం, వాహనాల పార్కింగ్, జడ్జిల నివాసాలకు అవసరమైనంత విశాలమైన స్థలం అందుబాటులో ఉండడంతో కోర్టు భవన సముదాయం పనులు ప్రారంభానికి సన్నాహాలు చేశారు. ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయడంతో పనులు మొదలవుతాయని అందరూ ఆశించారు. కానీ, ఆ ప్రాంతం కోర్టు నిర్మాణానికి అనువుగా లేదంటూ కొందరు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
స్థల సమస్యను కారణంగా చూపి..
పెద్దపల్లికి మూడు దశాబ్దాల కాలం క్రితమే మంజూరైన ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు స్థల సమస్య కారణం కావడంతో గోదావరిఖనికి తరలిపోయింది. పలు కార్యాలయాలు కూడా స్థల సమస్యతోనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి పోయాయి. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు భవన సముదాయం చేరింది. స్థలం కేటాయించి నిధులు సిద్ధంగా ఉన్నా న్యాయవాదుల మధ్య సఖ్యత లేక సమస్య తలెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తరలిపోయే ప్రమాదం ఉంది?
న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లాకోర్టు భవన సముదాయాన్ని మరో నియోజకవర్గ నేతలు తరలించుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికై నా పెద్దపల్లి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న రాఘవాపూర్‌లో కోర్టు భవన సముదాయానికి కేటాయించిన విశాలమైన స్థలంలోనే వీలైనంత త్వరగా ప నులు ప్రారంభించేలా చూడాలని పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల ఎమ్మెల్యే విజయరమణారావును కలిసి విన్నవించారు.