
ప్రాణనాథ్ పట్నాయక్ నిబద్ధత స్ఫూర్తిదాయకం: గవర్నర్
భువనేశ్వర్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత ప్రాణనాథ్ పట్నాయక్ 55వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక జయదేవ్ భవన్‌లో రాష్ట్ర ప్రణనాథ్ స్మారక కమిటీ నిర్వహించిన స్మారక కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ఆయనను ఒక దార్శనికుడిగా అభివర్ణించారు, ఆయన ఆదర్శాలు, న్యాయం, సమానత్వం, సామాజిక సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధత భావి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ప్రాణనాథ్ పట్నాయక్ నిర్భయ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు, మార్గదర్శక సోషలిస్ట్, రాజకీయ ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త, రచయిత, విద్యావేత్త, ప్రజలకు అంకితభావంతో కూడిన సేవకుడు అని కొనియాడారు. భారత దేశం రాజకీయ స్వేచ్ఛను సాధించినప్పటికీ పేదరిక నిర్మూలన, అసమానతలను తొలగించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడం వంటి సవాళ్లు ముఖ్యమైనవిగా ఉన్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో, ప్రాణనాథ్ పట్నాయక్ ఆదర్శాలు మన ప్రయత్నాలకు మార్గదర్శక వెలుగుగా పనిచేస్తాయన్నారు. విద్యను అందరికీ హక్కుగా, రాజకీయాలను సేవ యొక్క విధిగా, నాయకత్వం ప్రజలతో పాటు వారి పోరాటాలలో నడవడిగా ప్రాణనాథ్ పట్నాయక్ భావించారని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారిలో రాష్ట్ర న్యాయ, అబ్కారీ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, లోక్ సేవక్ మండల్ జాతీయ ఉపాధ్యక్షుడు దీపక్ మాలవ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు, సంబాద్ మరియు అమొ ఒడిశా వ్యవస్థాపక చైర్మన్ సౌమ్య రంజన్ పట్నాయక్ మరియు కిట్, కిస్ మరియు కిమ్స్ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత ఉన్నారు.

ప్రాణనాథ్ పట్నాయక్ నిబద్ధత స్ఫూర్తిదాయకం: గవర్నర్