
నాగావళి నదిలో యువకుడు గల్లంతు
రాయగడ: నాగావళి నదిలో స్నానం కోసం దిగిన యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి స్థానిక గురుంగుడ గ్రామానికి చెందిన బుడు శ్రీను (37)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గురుంగుడ గ్రామానికి చెందిన శ్రీను సోమవారం సాయంత్రం సమీపంలోని నాగావళి నదికి స్నానానికని వెళ్లాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అది గమనించని అతడు నీటిలో దిగగా అదుపుతప్పి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి గురుంగుడ నుంచి సుమారు కిలోమీటరు దూరం వరకు నదిలో గాలించినప్పటికీ ఆచూకీ కనిపించలేదు.
జూదశాలపై పోలీసుల దాడులు
జయపురం: జయపురం పట్టణ, సదర్ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు ప్రాతాలలో జోరుగా సాగుతున్న పేకాట అడ్డాలపై ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 20 మంది పేకాటదారులను అరెస్టు చేశారు. ఆయా దాడులలో పెద్ద మొత్తంలో డబ్బు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక సౌరా వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసి 79 వేల ఒక వంద రూపాయలను సీజ్ చేసినట్లు మంగళవారం వెల్లడించారు. అలాగే జయపురం సదర్ పోలీసులు పంపుణి గ్రామంలో త్రినాథ్ మందిరం సమీపంలో నిర్వహిస్తున్న పేకాటపై దాడి జరిపి 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 వేల 110 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రాత్రి సమయం కావడంతో కొంతమంది పరారైనట్టు పోలీసు అధికారి వెల్లడించారు. అరెస్టు అయిన జూదగాళ్లకు నోటీసులు జారీ చేసి విడిచి పెట్టినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ చెప్పారు. ఇది ఇలాఉండగా ఒడిశాలో కార్తీక పూర్ణిమను జూదాల పూర్ణిమంగా పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రతి చోట జూదం ఆడటం పరిపాటి. జూదాల పూర్ణమ సందర్భంగా జూదాలు ఆడే వారిపై దాడులు చేయటం భావ్యం కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మజ్జిగౌరి మందిరంలో
అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా పార్కు నుంచి ప్రధాన ముఖద్వారం వరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఆయా ప్రాంతంలోని తాత్కాలిక దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. రెండేళ్ల వ్యవధి కాలంలో డీపీఆర్ ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మందిరం సూపరింటెండెంట్ జానకీ వల్లభ్ , ఇంజినీర్ వెంకట్ తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని వసతులతో మందిరం ప్రాంగణంలో అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు.

నాగావళి నదిలో యువకుడు గల్లంతు

నాగావళి నదిలో యువకుడు గల్లంతు

నాగావళి నదిలో యువకుడు గల్లంతు