
విజిలెన్స్ వలలో ఇంజినీర్
● రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
జయపురం: లంచం తీసుకుంటూ జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితికి చెందిన ప్రభుత్వ ఇంజినీర్ లంభోదర నాయిక్ జయపురం విజిలెన్స్ అధికారుల వలలో పడ్డారు. ఒక కాంట్రాక్టర్‌కు బిల్లు పాస్ చేసేందుకు రూ. 20 వేలు ఇంజినీర్ డిమాండ్ చేశారు. దీంతో ఆయన విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సలహా మేరకు కాంట్రాక్టర్ ఆ డబ్బు ఇంజినీర్‌కు ఇస్తున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది దాడి జరిపి అతడిని రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. విజిలెన్స్ విభాగ అధికారుల సమాచారం ప్రకారం.. కుంద్ర సమితిలో గ్రామాభివృద్ధి రోడ్డు కుంద్ర శ్మశానం వరకు రూ. ఆరు లక్షల టెండర్ పనిని కాంట్రాక్టర్ ప్రఫుల్ల స్వైన్‌కు లభించింది. ఆ పని బిల్లు చేసేందుకు ప్రభుత్వ ఇంజనీర్ లంభోదర నాయిక్ కాంట్రాక్టర్‌ను 20 వేల రూపాయలు లంచంగా అడిగారు. ఈ విషయం ప్రఫుల్ల స్వైన్ జయపురం విజిలెన్స్ ఎస్పీ కార్యాలయంలో తెలిపాడు. విజిలెన్స్ అధికారుల సూచన మేరకు ఆదివారం సాయంత్రం స్వైయ్ డబ్బు తీసుకు వెళ్లి ఇంజినీర్‌కు అందజేశారు.అప్పటికే వేచి ఉన్న విజిలెన్స టీమ్ దాడి జరిపి డబ్బు సీజ్ చేసి ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. విజిలెన్స్ ఎస్పీ రవీంద్రకుమార్ పండ ఆదేశం ప్రకారం.. డీఎస్పీ సదానంద పాణి, అజయ ప్రదాన్, సూర్యమణి టక్రి, ఇన్‌స్పెక్టర్ సూర్య ప్రకాశ నాయిక్, సంతోషి బారిక్, సంజయ ప్రధాన్, అమీన్ గౌరీ చంద్ర బాగ్, గగణ బిహారీ పండ, సుజిత్ కుమార్ నాయిక్, ఏఎస్సై దిలీప్ కుమార్ భుయ, కేశవ గరులు దాడిలో పాల్గొన్నారు. 2021లో లంభోదర్ నాయిక్ కుంద్ర సమితిలో ఇంజినీర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయనను బొయిపరిగుడ సమితికి బదిలీ చేశారు.దసరా పండుగకు ముందుగా స్వైన్ కుంద్ర సమితికి పిప్యుటేషన్‌పై వచ్చారు. గతంలో కూడా అతనిపై ఒక విజిలెన్స్ కేసు ఉన్నట్లు తెలిసింది.