
బస్సు ఢీకొని అక్కాచెల్లెళ్లు మృత్యువాత
కొరాపుట్: బస్సు ఢీకొన్న ఠటనలో అక్కాచెల్లెళ్లు మృత్యువాతపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కట్ర అంబ గ్రామానికి చెందిన పితవాస్ ముదలి తన భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా..కొరాపుట్ నుంచి రాయగడ వైపు వస్తున్న ప్రైవేటు బస్సు దశమంత్‌పూర్ సమితి పంచడ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై అక్కాచెల్లెళ్లు భవానీ ముదలి (6), కవితా ముదలి (9) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులను స్థానికులు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు.