
కాల్పుల కలకలం
బీజేపీ సీనియర్ నేత, న్యాయవాది
పిత్తాబాస్ పండాపై కాల్పులు
ఛాతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
ఘటనా స్థలంలోనే మృతి
దుండగుల కోసం వేట
పర్లాకిమిడి: బరంపురంలోని బ్రహ్మనగర్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. సోమవారం రాత్రి 10 గంటల సమంయలో సీనియర్ న్యాయవాది, బీజేపీ గంజాం జిల్లా అధికార ప్రతినిధి పిత్తాబాస్ పండాను గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతి సమీపంలో రైఫిల్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే పిత్తాబాస్ మృతి చెందినట్టు బరంపురం ఎస్పీ ఎం.సరవనా వివేక్ వెల్లడించారు. పిత్తాబాస్ పండా బయటకు వెళ్లి తిరిగి బ్రహ్మనగర్‌లో తన ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే బరంపురం ఎం.కె.సి.జి.మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పాయింట్ రేంజ్‌లో కాల్చడంతో వెన్నముక దెబ్బతిన్నదని, ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడని డాక్టర్ సుదీవ దాస్ తెలిపారు. విషయం తెలుసుకున్న గంజాం జిల్లా బార్ కౌన్సిల్ సభ్యులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. పిత్తాబాస్‌ను ఎవరు.. ఎందుకు చంపారన్న విషయమై స్పష్టత రాలేదు. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం వేట ప్రారంభించారు.
మంత్రుల సంతాపం..
పిత్తాబాస్ పండా హత్య విషయం తెలుసుకున్న రాష్ట్ర ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహాన్ సామల్, రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులా నంద మల్లిక్, బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలియజేశారు. పండా కుటుంబసభ్యులను ధైర్యం చెప్పారు. పండా మరణం తీరని లోటని గంజాం జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. పిత్తాబాస్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను వెంటనే పట్టుకోవాలని గంజాం జిల్లా ఎస్పీ సరవనా వివేక్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ఆదేశించారు.

కాల్పుల కలకలం