
కార్తీక పూజలకు సన్నాహాలు
● భద్రత చర్యలపై పూరీ జిల్లా ఎస్పీ ఆదేశాలు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో కార్తీక మాసం పవిత్ర పూజాదులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నెల రోజులపాటు కార్తీక వ్రతం ఆచరిస్తారు. ప్రధానంగా వితంతు మహిళలు నిష్టతో పూజలు చేస్తారు. రాష్ట్రంలో సుదూర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వ్రత దీక్ష చేపట్టిన మహిళలు తరలి వస్తారు. వీరి కోసం పూరీ శ్రీమందిరం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత వసతి, జగన్నాథుని మహా ప్రసాదం, ప్రత్యేక దర్శన సౌకర్యం, వసతి నుంచి దేవస్థానం రాకపోకలకు ప్రత్యేక రవాణా, వసతి సముదాయంలో ఆరోగ్య సేవలు వంటి సుదపాయాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పట్ల పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ సన్నాహాలపై పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ముందస్తుగా సమీక్షించారు. అనుబంధ అధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
కొండను ఢీకొట్టిన లారీ
రాయగడ: విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బొగ్గు లోడతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కొండను ఢీ కొంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవ్వగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలోని జంఝావతి నదిపై గల బ్రిడ్జి మలుపులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవరును అక్కడ ఉన్నవారు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ద్విచక్ర వాహన ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
జయపురం: ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరగుడ సమితి బొదాపుట్ గ్రామ పంచాయతీ రౌత్‌గుడ గ్రామ ప్రాంతంలో ఆదివాయం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. రౌత్‌గుడ వాసి మితున్ జెన మల విసర్జన కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో బొయిపరిగుడ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టారు. దీంతో జెనతోపాటు ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమీపంలో ఉన్నవారు క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం జయపురం ఫూల్‌బెడ గ్రామ ప్రాంతంలోగల కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవంబర్ 11న నువాపడా
ఉప ఎన్నిక
భువనేశ్వర్: నవంబర్ 11న నువాపడా శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. 13న నువాపడా ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రచురిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు దాఖలుకు గడువు కేటాయించారు. గడువు లోగా దాఖలైన నామినేషన్ దస్తావేజులు అక్టోబర్ 22న పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. పోటీ నుంచి వైదొలిగేందుకు అక్టోబర్ 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు.

కార్తీక పూజలకు సన్నాహాలు

కార్తీక పూజలకు సన్నాహాలు