
అధికారుల అప్రమత్తతతో నష్ట నివారణ
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌కు 104 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులంతా అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి నష్టంజరగలేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందించారు. ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు.. అధికారులంతా స్టీల్ వాటర్ బాటిల్ తీసుకొని రావాలన్నారు. తుఫాన్‌ల గూర్చి ముందుగానే సమాచారం ఉంటుందని, మూడు రోజులు ముందుగానే సమాచారం తెలియజేస్తే అందరూ జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిని ఆదేశించారు.
వ్యాపారులు హాజరవ్వాలి
జీఎస్టీ 2.0పై ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న జీఎస్టీ ఎగ్జిబిషన్‌కు అధికారులతో పాటు వ్యాపారులు హాజరవ్వాలని కోరారు. వ్యవసాయ పనిముట్లు, మెడికల్ ఇన్సూరెన్సు, నోట్‌బుక్స్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా శాఖల అధికారులు షెడ్యూల్ ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
వినతుల స్వీకరణ
పీజీఆర్‌ఎస్‌లో భాగంగా మొత్తం 104 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ – 28, మున్సిపల్ కార్పొరేషన్ – 16, పంచాయతీ రాజ్ – 15, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ – 8, ఏపీఈపీడీసీఎల్ – 7, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ – 4, హౌసింగ్ – 3, వాటర్ రిసోర్సెస్ – 3, పౌర సరఫరాల శాఖ – 2, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ – 2, వ్యవసాయ శాఖ – 2, ప్రజా రవాణా శాఖ – 2, విభిన్న ప్రతిభావంతులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సాంఘిక సంక్షేమ శాఖ, రూరల్ డవలప్‌మెంట్, నైపుణ్యాభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసు, మెడికల్ ఎడ్యుకేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే...
● జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) ఆవరణలో జనరల్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందని, దీని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని శ్రీకాకుళం స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు బోర గోపి, ముకుందరావులు కోరారు.
● గుజరాతీపేటలోని లక్ష్మీ టాకీస్ వెనుకనున్న ప్రాంతంలో ఎక్కువగా మురుగు నీరు రోడ్లుపైనే ఉంటోందని, కాలువలు ఏర్పాటు చేయాలని వి.కాళీప్రసాద్, జి.కృష్ణారావు తదితరులు కోరారు.
● పాలకొండ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు బుడితి అప్పలనాయుడు తదితరులు విన్నవించారు.
● ఎచ్చెర్ల సీడీపీవో పాపినాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసరావుపై జేసీ విచారణ చేసి 15 రోజులు కావస్తున్నా ఐసీడీఎస్ పీవో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని బాలామృతం ట్రాన్సుపోర్టు కాంటాక్టర్ పైడి వెంకటరమణ రెండోసారి ఫిర్యాదు చేశారు.
● రణస్థలం మండలంలోని తెప్పలవలస గ్రామానికి చెందిన మేడూరి సత్యనారాయణమూర్తి తనకు వారసత్వంగా సక్రమించిన గ్రామకంఠం భూమిని 15 సంవత్సరాల క్రితం తన కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆ భూమిని కొంతమంది వ్యక్తులు వీఆర్‌వో ధ్రువపత్రంతో అక్రమంగా వేరేవారికి అమ్మివేశారని, అందువలన తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గ్రామం కంఠం భూమి క్రయవిక్రయాలకు వీఆర్‌వో ధ్రువపత్రం చెల్లదని, అయినా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ వద్ద వాపోయారు.