అమరావతి పేరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

అమరావతి పేరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం

Oct 5 2025 2:12 AM | Updated on Oct 5 2025 2:12 AM

అమరావతి పేరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం

అమరావతి పేరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం

నేడు ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం..

వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌, కేకే రాజు ధ్వజం

నేడు పెద్దిపాలెంలో ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం

సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. స్పీకర్‌ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్‌, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్‌నాథ్‌, కేకే రాజు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్‌ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్‌, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement