
శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
● ఇసుక వాహనాలను వెళ్లనీయమని గ్రామస్తుల హెచ్చరిక
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి బాగ్దెరి గ్రామ పంచాయతీ డొంగరపల్లి–కొట్రగుడ మధ్య రోడ్డును శ్రమదానంతో గ్రామస్తులు నిర్మించుకున్నారు. ఈ రోడ్డుపై ఇసుకతో వెళ్లే వాహనాలను అనుమతించబోమని జిల్లా దురువ జనజాతి మహిళ మహాసంఘం హెచ్చరించింది. శనివారం దురువ మహిళా మహా సంఘం నేతృత్వంలో ప్రజలు కుంధ్ర పోలీస్‌స్టేషన్ అధికారిని కలిశారు. శ్రమదానంతో రోడ్డును ఏర్పాటు చేసుకున్నామని.. దీనిపై ఇసుక వాహనాలను అనుమతించబోమని..దీనికి సహకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. 2020 అక్టోబర్ నెలలో డొంగరపల్లి నుంచి కొట్రగుడ గ్రామం వరకు 13 వందల మీటర్ల పొడవు రోడ్డును తామంతా శ్రమదానంతో నిర్మించు కున్నామని వెల్లడించారు. ఆ రోడ్డు పైనుంచి కొట్‌పాడ్ సమితిలో ఆరు గ్రామాలకు రోడ్డు ఉండేది కాదని వారు వెల్లడించారు. చతుర్ల గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే కొలాబ్ నది దాటి వెళ్లాల్సి ఉండేదని.. వర్షా కాలంలో 80 కిలో మీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉండేదని వివరించారు. అందుచేత ఆరు గ్రామాల ప్రజల రాకపోకలకు రోడ్డు నిర్మించాలని తాము అనేకసార్లు అధికారులను వేడుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆరు గ్రామాల ప్రజలంతా శ్రమదానంతో రోడ్డును నిర్మించుకున్నామన్నారు. తరువాత ఆ మార్గంలో అంబులెన్స్‌లు, పీడీఎస్ సరుకులు, తదితర ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరేందుకు అవకాశం కలిగిందని వెల్లడించారు. రోడ్డు నిర్మాణం తరువాత కాట్రగుడ వాసులు జగబందు హరిజన్, సొముదు ముదులి, లిక ముదులి, జొగ దురువ మొదలగు వారు కొలాబ్ నదిలో ఇసుకను జేసీబీలతో తవ్వి లక్షలాది రూపాయల విలువైన ఇసుకను వాహనాల్లో తరలించటం వలన తాము శ్రమదానంతో వేసిన రోడ్డు పాడవుతున్నదన్నారు. అందుచేత ఆ మార్గంలో ఇసుక వాహనాల రాకపోకలు జరిపేందుకు తాము అనుమతించమని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఆ మార్గంలో ఇసుక వాహనాలను అడ్డుకుంటామని స్పష్టం చేయటంతో గత నెల 24వ తేదీన ఐదుగురు వ్యక్తులు వచ్చి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకొనేందుకు జరిగిన సమావేశంలో శ్రమదానంతో నిర్మించిన రోడ్డుకై న డబ్బును సంఘ సభ్యులు స్వాహా చేశారని అసత్య ఆరోపణలు చేశారని వారు వెల్లడించారు. ప్రభుత్వ నియమం ప్రకారం టెండర్ పాడకుండా ఇసుకు మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రమదానంతో వేసిన రోడ్డుపై వెళ్లే ఇసుక వాహనాల నుంచి డబ్బు వసూలు చేసినట్టు చేసిన ఆరోపణకు ఆధారాలు చూపాలని వారు వినతి పత్రంలో డిమాండ్ చేశారు. పోలీసు అధికారులను కలిసిన వారిలో రొయిమతి దురువ, సావిత్రి దురువ, జయంతి దురువ, చక్రవతి దురువ, బాసు దురువ, మనోజ్ దురువ, భగత్ దురువ, లక్ష్మీ దురువ, భాబే దురువ, బొనసింగి దురువతో పాటు అనేక గ్రామాల ప్రజలు ఉన్నారు.