
గ్రీన్ క్లైమేట్ ఫండ్‌తో మత్స్యకారులకు ఉపాధి
కృష్ణా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో చేపట్టే కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ. 85 లక్షలు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులు జిల్లాకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. జిల్లాలో 1420 ఎకరాలను మడ అడవులుగా రూపొందించేందుకు గుర్తించామన్నారు.
ఏం చేయాలాంటే..
ఈ సంవత్సరం వినూత్నంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో పీతలు, అలంకార చేపలు, సముద్రనాచు పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఇందులో భాగంగా 40 పీతల పెంపకం యూనిట్లు, 23 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 25 సముద్ర నాచు పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు మేనేజర్ ఉష, డీఎఫ్‌వో సునీత, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, ఆర్డీవో స్వాతి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.