గుణదల(విజయవాడ తూర్పు): చెట్టు పై కొమ్మలు కొడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రీ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరుకు చెందిన ఆళ్ల రమణ(36) కూలి పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ గాయత్రీనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలు నరికేందుకు చెట్టు పైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి కొమ్మలతో పాటే కిందికి పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయమైంది.
ఇది గమనించిన స్థానికులు అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.
గూడు చెదిరి.. గుండె పగిలి వృద్ధుడు మృతి
గుణదల(విజయవాడ తూర్పు): నాలుగు దశాబ్దాలుగా తాను నివసిస్తున్న ఇంటిని కోల్పోతున్నాననే బాధతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయవాడ గుణదల ప్రాంతంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గుణదల పుల్లేటి కట్ట రోడ్డు ప్రాంతానికి చెందిన తోటకూర నాంచారయ్య (60) చిరువ్యాపారి. వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. గుణదల పుల్లేటి వాగు వీధిలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల స్థానికుల ఇళ్లు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది.
కొన్ని ఇళ్లు తొలగించడంతో బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం ఇవ్వకుండా తమ ఇళ్లను తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న నాంచారయ్య ఇళ్ల తొలగింపు విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. త్వరలోనే తన ఇల్లు తొలగిస్తారని నాంచారయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చి ఇంట్లోనే కన్ను మూశాడు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల పాలిట శాపంగా పరిణమించాయని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
మహిళను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
విజయవాడలీగల్: దొంగతనం కోసం వచ్చి మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే యేదుపాటి పద్మావతి 2020 జనవరి 31వ తేదీ సాయంత్రం తన ఇంట్లో హత్యకు గురైంది.
గుర్తు తెలియని దుండగుడు పద్మావతి గొంతు కోసి పొట్ట, ఛాతీ బాగాలలో కత్తితో పొడిచి, ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు, ఇంట్లో ఉన్న బంగారం, వస్తువులు, నగదు తస్కరించాడు. హతురాలి భర్త ఫిర్యాదుమేరకు అప్పటి భవానీపురం పోలీస్‌స్టేషన్ సీఐ డి.కె.ఎన్.మోహన్‌రెడ్డి దర్యాప్తు చేసి అదే సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన నిందితుడు గవిరినేని అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.రాధ, ఎం. జ్ఞానాంబ, సీఎంఎస్ సీఐ జగదీశ్వరరావు, ప్రస్తుత భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు, సీఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో 27 మంది సాక్షులను విచారించారు. నిందితుడిపై నేరం రుజువైనందున మంగళవారం మహిళా సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జి.రాజేశ్వరి నిందితునికి జీవిత ఖైదు, 2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.