ఎస్‌ఆర్‌ఆర్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎంతో ఘన చరిత్ర కలిగిన మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ ఫైనల్ విద్యార్థి కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది. కళాశాలలో అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి విద్యార్థి దూకటంతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇప్పటి వరకు ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే ఇటువంటి సంఘటనలు జరిగేవి. విద్యార్థులలో వత్తిడి పెరిగిపోవటమే ఈ దుర్ఘటనకు కారణమని, వత్తిడి తగ్గించేందుకు కళాశాలలో తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలలోకి వెళితే... కృష్ణలంకకు చెందిన ఎస్.వెంకట రవి డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ పూర్తికానుండటంతో తాను చదివిన చదువుకు ఉద్యోగం వస్తుందో రాదోనని, తనకు మంచి మార్కులు వస్తాయో రావోనని మథన పడుతున్నాడు. ఇదే విషయంపై తనకు ఉద్యోగం వస్తుందోలేదోనంటూ ఇంట్లో సోమవారం ఆందోళన వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ఉద్యోగం వస్తే వస్తుంది.. లేకపోతే వేరే పనిచేసుకోవచ్చంటూ సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో రవి మంగళవారం కళాశాలకు వచ్చిన తరువాత అధ్యాపకులు పరీక్షల జవాబు పత్రాలు ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరినీ తోసుకుంటూ వెళ్లి రెండో అంతస్తు నుంచి దూకేశాడు. కిందపడిన రవి రెండు కాళ్లు విరిగిపోవటంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు 108కు ఫోన్ చేయగా అరగంట వరకు రాలేదు. 108 వచ్చిన తరువాత చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలియజేసి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కాళ్లకు మాత్రం సర్జరీ చేయాలని తెలియజేశారు.
అధ్యాపకుల వేధింపుల వల్లే
ఆత్మహత్యాయత్నం?
కళాశాలలో అధ్యాపకుల వేధింపుల వల్లే రవి ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా కళాశాల సిబ్బంది వ్యవహరిస్తున్నారని విద్యార్థులు అంటు న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మిని వివరణ అడిగితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మధ్యాహ్నం జరగాల్సిన సైన్స్ తరగతులు రద్దు చేశారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
కళాశాల రెండో అంతస్తు నుంచి
కిందకు దూకిన విద్యార్థి
అధ్యాపకుల వేధింపుల వల్లే అంటూ ఆరోపణలు..?
ఉన్నతాధికారులు విచారణ
చేయాలంటూ డిమాండ్


