
సమష్టి కృషితోనే దసరా ఉత్సవాలు విజయవంతం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ధన్యవాదాలు తెలిపారు. దసరా శరన్నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడంలో కృతకృత్యులయ్యామని చెప్పారు. గత ఏడాది కంటే అధికంగా 16.5 లక్షల మంది వచ్చారని, అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశామని అన్నారు. గత ఏడాది దసరా అనుభవాలతో నగర పోలీస్ కమిషనర్ ఒక పుస్తకం రూపొందించారని, ఇప్పుడు అన్ని శాఖల అభిప్రాయాలతో ఒక పుస్తకాన్ని రూపొందిస్తామని, భవిష్యత్‌లో దసరా నిర్వహణకు ఈ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాల బందోబస్తు తన 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్‌గా అభివర్ణించారు. నేరస్తులు ఎవరైనా వస్తున్నారా అనేది తెలుసుకోవడానికి 1.40 లక్షల మంది ఫొటోలతో ఎఫ్‌ఆర్‌ఎస్ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ పూర్తి సమన్వయం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఉత్సవాల నిర్వహణే నిదర్శనమన్నారు. సమావేశంలో డీసీపీ సరిత తదితరులు మాట్లాడారు. అనంతరం పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
కలెక్టర్ లక్ష్మీశ, సీపీ,
వీఎంసీ కమిషనర్