కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహర్షి వాల్మీకి జీవితం, ఆయన సమాజానికి అందించిన రామాయణ మహా కావ్యం గొప్ప స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొనియాడారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వాల్మీకి కవిగా, మహర్షిగా తన జీవితాన్ని మలుచుకోవడమే కాకుండా అద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని ఈ సమాజానికి అందించడం ద్వారా గొప్ప సందేశాన్ని అందించారన్నారు. మనిషి సంకల్పిస్తే ఏదైనా సాధించగలమని వాల్మీకి జీవితం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.


