
12న సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 12వ తేదీ సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం పదో వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు తట్టి అర్జునరావు, అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం ఆధ్వర్యాన సంఘం పదో వార్షికోత్సవం, సౌత్‌ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెమినార్‌కు రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్లు చెప్పారు. షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నార్త్ నుంచి 6 రాష్ట్రాలు, సౌత్ నుంచి 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం తట్టి అర్జునరావు ఎన్నికల అధికారిగా ఆయన పర్యవేక్షణలో నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బందరు మల్లయ్య స్వీట్స్ అధినేత గౌరా వెంకటేశ్వరరావు, దుర్గారావు, అంజయ్య, బి.నాగభూషణం , ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కురుబ, కురుమ, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.
వివాహితను వేధిస్తున్న
బాలుడిపై కేసు నమోదు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.