
పాత కక్షలతోనే వృద్ధురాలి హత్య
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వృద్ధురాలిని హత్య చేసి ముక్కలుగా కోసి సంచలనం సృష్టించిన కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతోనే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల ఒకటో తేదీన గొల్లపూడిలోని బొమ్మసాని నగర్ వద్ద మురుగునీటిలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారమందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అది మహిళ మృతదేహంగా గుర్తించారు. మృతదేహానికి కాళ్లు, చేతులు, తల లేకుండా మొండెం మాత్రమే ఉంది. దానిపై విచారణ చేపట్టగా ఆ మృతురాలు పొత్తూరి విజయలక్ష్మి (70)గా గుర్తించారు. ఆమె గత నెల 30వ తేదీన సాయిరాం థియేటర్ వద్ద ఉన్న వాసవీ కల్యాణమండపం వద్దకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో అక్కడ సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా వంకదార హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యంకు చెందిన మైనర్ కుమారుడు మృతురాలిని తన పల్సర్ వాహనంపై ఎక్కించుకొని హెచ్‌బీ కాలనీలోని తన నివాసానికి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు లోపలకు వెళ్లిన ఆ మహిళ తిరిగి బయటకు రాలేదు. అయితే ఆమెను తీసుకొచ్చిన బాలుడితో పాటుగా అతని తండ్రి వంకదార హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యం పలుమార్లు బ్యాగులతో బయటకు వచ్చి బండిపై వెళ్లినట్లుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను బుధవారం దర్గా ప్లాట్స్ వద్ద అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి వృద్దురాలి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో 30వ తేదీన వృద్ధురాలిని ఇంటికి తీసుకొచ్చిన తరువాత హత్య చేసి ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడవేసి నగరం నుంచి పరారయ్యామని నిందితులు తెలిపారు. పాతకక్షల కారణంగానే ఆమెను చంపినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. విజయలక్ష్మి హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యంకు వరసకు పిన్ని. నగరంలోని సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో చురుకుగా పని చేసిన సిబందిని అధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ దుర్గారావు, సీఐ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.