
ఒక్క పింఛనూ మంజూరు చేయలేదు!
కూటమి పనితీరుపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల మండిపాటు కొత్త పింఛన్ల మంజూరుపై కౌన్సిల్లో నిలదీత డయేరియాపై దద్దరిల్లిన సభ
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఇప్పటి వరకు నూతనంగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. విజయవాడ నగర పాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం నిర్వహించారు. సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 159 అంశాలు పొందుపరచగా అందులో 124 అంశాలను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ రెహానానాహిద్ అడిగిన ప్రశ్నకు అధికారులు, కూటమి కార్పొరేటర్లు సమాధానం చెప్పలేక చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డెప్యూటీ మేయర్ బెల్లందుర్గ, అవుతుశైలజ, ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం, పుణ్యశీల కల్పించుకుని ఇప్పటి వరకు ఒక్క సామాజిక భ్రదత పింఛను మంజూరు చేయకపోవటం కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో 20 వేల పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో 8047 పింఛన్లు వెరిఫికేషన్ చేశారని, 5608 మందికి పింఛన్లు అందటంలేదని వెల్లడించారు. 402 మంది దివ్యాంగులకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని నిర్థారించారని చెప్పారు. మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ కొత్త పింఛన్ల నమోదుకు కనీసం వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేయలేదని పేర్కొన్నారు. ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించకపోవడం కూటమి పని తీరుకు నిదర్శనమన్నారు.
ప్రైవేటు వాటర్‌ప్లాంట్‌ల
నుంచే డయేరియా వ్యాప్తి
నగరంలో ప్రబలిన డయేరియాపై కౌన్సిల్ దద్దరిల్లింది. డయేరియా వ్యాప్తి చెందడానికి స్పష్టమైన సమాధానం అధికారులు ఇవ్వలేకపోయారు. నేటికీ అజిత్‌సింగ్‌నగర్‌లోని న్యూ, ఓల్డ్ ఆర్‌ఆర్‌పేటలో నీళ్లు మురికిగా, నలకలతో రంగుమారి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీఎంసీ, జిల్లా యంత్రాంగం రోజుల తరబడి నీళ్ల పరీక్షలు నిర్వహించినా సమస్యను గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందని కార్పొరేటర్ ఇసరపు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర స్పందింస్తూ స్థానికంగా ఉన్న ఐదు ప్రైవేటు ఆర్‌వో ప్లాంట్‌ల నుంచి జరిగిన నీటి సరఫరాలో ఎకోలియా బ్యాక్టీరియా గుర్తించామని చెప్పారు.
దసరా ఉత్సవాల్లో వీఎంసీ భాగస్వామ్యంపై చర్చ
దుర్గామల్లేశ్వర్ల దేవస్థానంలో ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో వీఎంసీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, కార్పొరేటర్ల పాస్‌ల వ్యవహారం, పోలీసుల అత్యుత్సాహంలో తాము అవమానాలకు గురవుతున్నామని కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్యం మెరుగుదల, తాగునీటి సరఫరా, క్లోక్‌రూం, తాత్కాలిక మరుగుదొడ్లు, కార్మికుల సరఫరా అంతా వీఎంసీ నిర్వహణలో ఉంటుందన్నారు. వాటికి అయ్యే ఖర్చంతా దుర్గామల్లేశ్వర్ల దేవస్థానం అందిస్తుందని, వీఎంసీ నుంచి నిధులు సమకూర్చటంలేదని, ప్రోటోకాల్ వ్యవహారంలో ప్రభుత్వం, జిల్లా అధికారులతో చర్చించి సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సభకు వివరించారు.
బుడమేరు ముంపుపై ...
గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల సమయంలో ఆస్తులు, వ్యాపారాలు, ఇతరత్రా నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదని కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి సభలో ప్రస్తావించారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పటంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జానారెడ్డి, శర్వాణామూర్తి, డెప్యూటీ మేయర్ అవుతు శైలజరెడ్డి కల్పించకుని నేటికీ నష్టపరిహారం అందలేదని, బుడమేరు వరద ముంపు నివారణకు ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకటించారు. వీఎంసీ నుంచి బుడమేరు ముంపు నివారణకు రూ. 56 కోట్ల నిధులు అవసరమని అంచనాలు ప్రభుత్వానికి పంపితే కేవలం రూ. 9 కోట్లు మాత్రమే మంజూరు చేశారని ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా వరద ముంపు నివారణకు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.400 కోట్లతో రిటైనింగ్‌వాల్ నిర్మించామని చెప్పారు. ఆ ప్రాంత ముంపు బెదడను కేవలం ఏడాదిలో తీర్చామని తెలిపారు. కానీ బుడమేరు వరద ముంపు నివారణపై ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందే కానీ నెరవేర్చలేదన్నారు.