
ప్రత్యేక రైలులో తీర్థయాత్ర
ఖలీల్‌వాడి: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తీర్థయాత్రలకు ప్రత్యేక పర్యాటక రైలు (భారత్ గౌరవ్)ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ యాత్ర అక్టోబర్ 7 నుంచి 16 వరకు ఉంటుందని, ద్వారకాదీష్ మందిరము, నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరము, భేట్ ద్వారక, సోమనాథ్ జ్యోతిర్లింగ మందిరము, సబర్మతి ఆశ్రమం, సూర్యదేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) దర్శించుకోవచ్చునని తెలిపారు. ప్రయాణికులకు ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.18,400, త్రీ ఏసీ రూ. 30,200, టూ ఏసీ రూ.39,900 చెల్లించాలని పేర్కొన్నారు. ప్యాకేజీలో మూడు పూటల భోజన వసతి, రవాణా సౌకర్యాలు, ప్రతి కోచ్‌లో ఐఆర్‌సీటీసీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్‌సీటీసీ టూరి జం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఐఆర్‌సీటీసీ 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9701360701, 9281030711, 92810 30749, 9281495845, 9281495843 నంబర్లకు లేదా www. irctctourism. com వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.